బీసీ సంఘాలకు జాతీయ నాయకుడు అయిన ఆర్.కృష్ణయ్య మీద భారతీయ జనతా పార్టీ అతిగా ఆశలు పెట్టుకున్నదా? ఆయన తమ అమ్ముల పొదిలో ఉంటే.. జాతీయ స్థాయిలో బీసీలు కమలదళానికి వెన్నుదన్నుగా నిలబడతారని.. కనీసం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ బీసీలు తమ పార్టీకి నీరాజనం పడతారని బిజెపి భ్రమిస్తున్నదా? అనే అనుమానం కలుగుతోంది. బీసీల కులతిలకుడుగా ఒకప్పుడు ఆర్.కృష్ణయ్య ప్రాభవం ఎలాగైనా ఉండవచ్చు గానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు బీసీ కులాలందరినీ ప్రభావితం చేసేంత సీన్ లేదనే అభిప్రాయమే పలువురిలో వినిపిస్తోంది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేయడం ద్వారా.. భారతీయ జనతా పార్టీ స్థానిక నేతలకు ద్రోహం చేసిందనే అభిప్రాయం కూడా ఆ పార్టీ వారిలో ఉంది.
ఏపీలో బిజెపి ఇప్పుడున్న దానికంటె బలమైన పార్టీగా విస్తరించాలని అనుకుంటూ ఉంది. ఎప్పటినుంచో వారికి ఈ ఆలోచన ఉంది. అయితే రకరకాల కారణాల వల్ల.. ఏపీ ప్రజలు బిజెపిని ప్రధాన పార్టీల్లో ఒకటిగా ఆదరించడం లేదు. పొత్తులు పెట్టుకుంటే మాత్రమే అధికారంలోకి రాగలిగే పార్టీలాగా మాత్రమే ఉంది. అయితే పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆశ మాత్రం ఉంది. అందుకోసం ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం వస్తే.. తెలంగాణకు చెందిన నాయకుడిని అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకుని మరీ.. ఆ పీఠం దక్కవలసిన అవసరం ఉన్నదా? అనేది పార్టీ నాయకుల ప్రశ్న.
ఏపీలోగానీ, తెలంగాణలో గానీ.. తొలినుంచి ఆరెస్సెస్, బిజెపిలను నమ్ముకుని ఉన్న మరో బీసీ ప్రముఖులు ఎవ్వరూ లేరా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.
నిజం చెప్పాలంటే ఆర్.కృష్ణయ్య మీద ఇదే తరహా అత్యాశతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుని ఏపీనుంచి రాజ్యసభకు పంపారు. దానివల్ల.. బీసీ వర్గాల్లో తన పార్టీ అద్భుతంగా మారిపోతుందని అనుకున్నారు. తీరా ఎన్నికలు వచ్చిన సమయానికి ఏం జరిగింది. బీసీలందరూ కూడా ఉమ్మడిగా ఛీకొట్టారు కాబట్టే.. వైసీపీ అంత దారుణంగా పతనం అయింది. బీసీల నేత ఆర్.కృష్ణయ్య లాంటి వాళ్లు ఆ పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడలేకపోయారు. తల బొప్పి కట్టింది. జగన్ కు ఎదురైన అనుభవాన్ని చూసి కూడా.. బిజెపి మళ్లీ అదేమాదిరి అత్యాశతో.. ఆయననే తీసుకువచ్చి ఏపీనుంచి ఎంపీ చేయడం సరైన వ్యూహమేనా అనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. ఆ పార్టీ ఏపీ లోని బీసీ నేతల్లో అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి.
ఆర్.కృష్ణయ్యపై భాజపా అతిగా ఆశ పెట్టుకుందా?
Thursday, January 2, 2025