మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీని పునర్నిర్మించడం అనే ఎజెండా కింద కార్యకర్తలు నాయకులతో సమావేశం పెడుతున్నారంటే.. అక్కడ ఆయన ఏం చెప్పబోతారో ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ కంఠతా వొచ్చేసింది. ఎన్నికల ప్రచారం నాడు ఊరూరా తిరుగుతూ ఆయన ఏ మాటలనైతే కాగితాలు చూసుకుంటూ చదువుతూ వచ్చారో.. ఇప్పటికీ ఏ చిన్న పార్టీ మీటింగు పెట్టినా.. అవే కాగితాలు చదువుతూ ఉంటారు. విన్న కార్యకర్తలకే మొత్తం కంఠతా వొచ్చేసింది గానీ.. జగనన్న మాత్రం.. ఇప్పటికీ చదువుతూనే ఉంటారు. అలాంటిదే మరో అరిగిపోయిన రికార్డు ఉపన్యాసానికి జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం జరగుతుందిట. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు ఎలా చేయాలనే దానిపై ప్రధానంగా ఈ సమావేశం ఫోకస్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముందు సమావేశం ఎజెండా గురించి ఇలాగే చెబుతుంటారు గానీ.. వాస్తవానికి జరిగేది మాత్రం వేరు. ప్రారంభం నుంచి ఓ గంటపాటూ.. ఏకబిగిన తన అరిగిపోయిన గ్రాంఫోను రికార్డు ఉపన్యాసాన్ని జగన్ వినిపిస్తారు. ప్రజలందరూ తనను ప్రేమిస్తున్నారు ఓట్లు మాత్రం రాలేదని, మాయమైపోయాయని, ఏం జరిగిందో దేవుడికే తెలియాలని అంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలుస్తాం అంటూ ముగిస్తారు.. అని ఆ పార్టీ కార్యకర్తలే జోకులు వేసుకుంటున్నారు.
ఈ భేటీకి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఇంకా కమిటీల ఏర్పాటు గురించి చర్చ జరుగుతుందని అంటున్నారు.
ప్రధానంగా తన ప్రభుత్వ కాలం నాటి వైఫల్యాలను చంద్రబాబు ప్రభుత్వం మీద రుద్దేయడానికి జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పాలన కాలం నాటి పాపాల ఫలితంగా.. విద్యుత్తు సర్దుబాటు చార్జీలను అనివార్యమైన పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం పెంచవలసి వచ్చింది. అయితే చార్జీలు పెంచినందుకు ఈ ప్రభుత్వాన్నే నిందించడానికి వీరు సిద్ధమవుతున్నవారు. అలాగే జగన్ పాలన కాలంలో పీజు రీఇంబర్స్ మెంట్ కు బటన్ నొక్కారు గానీ.. డబ్బులుమాత్రం వెళ్లలేదు. రీఇంబర్స్ మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం మీద నిందలు వేయాలని జగన్ అత్యుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ స్థాయి పార్టీ నాయకులతో ఈ కీలక సమావేశం ఏర్పాటు చేయడం వెనుక అసలు సీక్రెట్ ఎజెండా వేరే ఉందని అంటున్నారు.
సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో జగన్ పర్యటించాలని అనుకుంటున్నారు. ఆయన పర్యటనకు ఖర్చులు స్థానికంగా ఏయే నాయకులు పెట్టుకోవాలి? అప్పుడు సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చుల బాధ్యత ఎవరిది? లాంటి అంశాల్లో ఏయే స్థాని నాయకుల మీద ఎంత భారం వేయాలో నిర్ణయించడానికే మీటింగు పెడుతున్నారని.. అసలే ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టినప్పటికీ.. ఓడిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్న తమ మీద జగన్ సభలు పెద్ద ఆర్థిక భారం కాబోతున్నాయని నాయకులు లోలోపల అనుకుంటున్నారు.