ఇంతకూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష నేతగా హోదా కూడా లేకుండా అవమానకరమైన పరిస్థితిలో కూర్చోబెట్టింది ఎవరు? ఒక విడత ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అనుభవంలో కొంత జ్ఞానం వచ్చి ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి.. విధివిధానాల గురించి తెలియనట్టుగా అమాయకంగా.. సభలో ప్రతిపక్ష నేత హోదా ఉండాలంటే పది శాతం ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉండాలనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని బొంకుతూ ఉండవచ్చు గాక! కానీ ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పును.. చంద్రబాబునాయుడు కుట్రలాగా అభివర్ణిస్తూ ఆయన మీదికి నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ కుటిలయత్నాలు ప్రజల దృష్టిలో నవ్వులపాలు అవుతున్నాయి.
పార్టీ నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా తాడేపల్లి కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారని.. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకోసం ఐదారు నెలలుగా ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం.. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం ఇది..’’ అని అంటున్నారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండరాదనే ప్రజా తీర్పు ఒక కుట్ర అయితే గనుక.. అలాంటి కుట్ర చేసింది రాష్ట్రప్రజలు కదా.. దానిని చంద్రబాబుకు ఆపాదిస్తే ఎలా అనే సందేహం పలువురికి కలుగుతోంది.
సజ్జల మాటలు వింటోంటే ప్రజలకు మరో అభిప్రాయం కూడా కలుగుతోంది. ప్రతిపక్ష హోదా దక్కేంతగా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎమ్మెల్యే స్థానాలు కట్టబెడితే.. వారు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నానారకాలుగా చికాకు పెడుతూ అడుగు ముందుకు వేయనివ్వరు అనే భయంతోనే ప్రజలు కనీసం 18 సీట్లు ఇవ్వకుండా 11కు పరిమితం చేసి మూలన కూర్చోబెట్టారేమో అనిపిస్తోంది.
ప్రజల తీర్పును ఇప్పటికీ గౌరవించకుండా.. తాము ఓడిపోవడం బాబు కుట్రఅని, మన పథకాల పట్ల ప్రజల్లో అభిమానం చెక్కుచెదరలేదని కల్లబొల్లి కబుర్లను పార్టీ అంతర్గత సమావేశాల్లో తీర్మానించుకుంటే.. ఆ పార్టీని ఇక ఎవ్వరూ ఎప్పటికీ బాగుచేయలేరని పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.