కిందపడ్డా సరే.. పైచేయి నాదే అనే బాపతు మనుషుల గురించిన ముతకసామెత మనకు తెలుసు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. సోషల్ మీడియా సైకోలకు బూతు కంటెంట్ ముడిసరుకును సరఫరా చేసి, అందరికంటె అతిపెద్ద పాపానికి ఒడిగట్టిన అప్పటి వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డి కి సుప్రీం కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అసలు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తనమీద నమోదు అయిన పోస్టులు అన్నింటినీ.. కొట్టివేయాలని కోరుతూ సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కపిల్ సిబల్ వంటి సుప్రసిద్ధ న్యాయవాదిని తన కేసుకోసం తీసుకున్నారు. అయితే ఆయన పిటిషన్ కు విచారణార్హత లేదంటూ సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ ను తిరస్కరించింది.
వాస్తవంగా జరిగింది ఇది కాగా.. జగన్ అనుకూల ప్రచారానికి పాల్పడుతూ ఉండే ఆయన కరపత్రిక మాత్రం.. సుప్రీం తీర్పునకు వక్రభాష్యం చెబుతూ తమ ద్వారా.. సుప్రీం నిర్ణయాన్ని వక్రీకరించి ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించిందని.. ఆయనకు రెండు వారాల పాటు అరెస్టునుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా కథనాల్ని అందించారు. హైకోర్టులో వాదనలు వినిపించుకోవాలని సూచించినట్టు చెప్పారు.
వాస్తవానికి.. చెప్పుకునేది ఏదైనా ఉంటే హైకోర్టులో చెప్పుకోవాల్సిందే తప్ప.. సుప్రీం కోర్టుకు రావడానికి ఈ పిటిషన్ కు అర్హతలేదు అని సుప్రీం జస్టిస్ సూర్యకాంత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కొత్త చట్టాల ప్రకారం పాత తప్పులపై కేసు పెట్టడం కరెక్టు కాదు అని.. సజ్జల భార్గవ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదించినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చట్టం కొత్తదా పాతదా అనేది కాదు.. మహిళలపై ఎలాంటి అసభ్య పోస్టులు పెట్టారో చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. దుర్భాషలాడే తప్పు చేసిన వారు.. విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం తీవ్రంగా వ్యాఖ్యానిస్తే.. నీలిదళాలు మాత్రం.. అక్కడ సజ్జల భార్గవ్ విజయం సాధించినట్లుగా తప్పుడు కథనాల్ని ప్రచారంలో పెట్టి, తర్వాత కొద్ది సేపటికి ఆ తప్పుడు వార్తను తమ వెబ్ సైట్ నుంచి తొలగించేయడం గమనార్హం.