అమరావతి రాజధాని ప్రియులకు ఇది మరో శుభవార్త. రాజధానిలో నిర్మించబోయే ఐదు ఐకానిక్ భవనాలకు సరికొత్త డిజైన్లు సిద్ధం అయ్యాయి. నార్మన్ పోస్టర్స్ సంస్థ ఈ కొత్త డిజైన్లను కూడా రూపొందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తయారైన డిజైన్లను కూడా వీరే రూపొందించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే జగన్ వచ్చిన తర్వాత ఆ సంస్థ టెండర్లను, వారి డిజైన్లను రద్దు చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఐకానిక్ భవనాల డిజైన్లకోసం కొత్త డిజైన్లకు టెండర్లు పిలిచింది. అదేసంస్థ నార్మన్ పోస్టర్స్ టెండరు దక్కించుకుని డిజైన్లు చేసినట్టుగా మంత్రి నారాయణ ప్రకటించారు.
ఈ ఐకానిక్ భవనాల తుది డిజైన్లకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని, ఆ తర్వాత పనులు ప్రారంభం అవుతాయని నారాయణ అంటున్నారు. డిసెంబరు 15 నుంచి ఇతరత్రా అమరావతిలో పునర్నిర్మాణ పనులు మొదలు కాబోతున్నట్టు చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఈ సంగతులన్నీ క్రోడీకరించుకుంటే.. మూడు నాలుగేళ్లలో అద్భుత రాజధాని తెలుగు ప్రజల కనుల ఎదుట సాక్షాత్కరిస్తుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది.
అమరావతి రాజధానిని చంద్రబాబునాయుడు స్వప్నించారు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంవైపు తలతిప్పి చూసేలా తెలుగు ప్రజలు గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తానని చంద్రబాబు అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు. అందుకు అనేక అడుగులు పడ్డాయి కూడా. కీలకమైన ఐకానిక్ భవనాల నిర్మాణానికి పునాదులు కూడా పడ్డాయి. ఇంతా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం అనేది అమరావతికి పెనుశాపంగా పరిణమించింది. రైతులు రాజధానికోసం ఇచ్చిన 55 వేల ఎకరాలను మరుభూమిగా మార్చేయడానికి జగన్ కంకణం కట్టుకుని పనిచేశారు. అయిదేళ్లలో ఆ ప్రాంతమంతా అడవులను తలపించేలా తయారైంది.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్మిర్మాణానికి నడుం బిగించారు. ఐదు ఐకానిక్ టవర్లతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియేట్ భవనాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్నారు. వీటికే సరికొత్త డిజైన్లు కూడా సిద్ధం చేయించారు. గతంలో పనులు చేపట్టిన తర్వాత.. అయిదేళ్లు గ్యాప్ రావడంతో.. ఇప్పటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, ఏఐ అవసరాలకు తగినట్టుగా ఆయా భవనాల రూపురేఖలు, అంతర్గత నిర్మాణంలో మార్పులు ఉండేలా కొత్త డిజైన్లను సిద్ధం చేయిస్తున్నారు.