‘ఒక కుటుంబంలో ఒకరు మాత్రమ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలి’ ఈ మాట వింటే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా! ఇలాంటి నైతిక విలువలను పాటించే నాయకులు మనకు ఎక్కడ కనిపిస్తారా? అని మనం దేవులాడుతాం కదా? ఈ మాట ప్రవచించినది మరెవ్వరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్న రోజుల్లోనే ఇలాంటి నీతి వాక్యాన్ని ఆయన ప్రవచించారు. ఏ సందర్భంలో ప్రవచించారనేది ఇక్కడ కీలకం. తన చెల్లెలు, తన పార్టీ విజయం సాధించడానికి చెమటోడ్చి పనిచేసిన వైఎస్ షర్మిలకు ఒక రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వచ్చు కదా అనే ప్రతిపాదన తన ఎదుటకు వచ్చినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నైతిక విలువలను ప్రవచించారు. ఈ విషయాన్ని వారి కుటుంబానికి బంధువు, జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా వెల్లడించారు.
ఇంత అద్భుతమైన సూత్రం ప్రవచించిన జగన్మోహన్ రెడ్డి నీతికి కట్టుబడి ఉన్నారా? అంటే అది కూడా లేదు. నిజానికి ఆ నీతిని ప్రతిపాదించే నాటికే ఆయన ఆ నీతితప్పి ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబంలో అప్పటికే ముగ్గురు (రామచంద్రారెడ్డి, ద్వారకనాధెడ్డి ఎమ్మెల్యేలుగా, మిథున్ రెడ్డి ఎంపీగా) పదవుల్లో ఉన్నారు. బొత్స సోదరులు ఉన్నారు. ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉంటాయి. అయితే వారందరికీ లేని నీతి, తన చెల్లెలుకు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వాలంటే మాత్రమే జగన్ కు అడ్డు వచ్చింది.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి దగ్గరి బంధువే అయినప్పటికీ.. ఒకే సందర్భంలో మాత్రం తాను జోక్యం చేసుకున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు. అప్పటికే కుటుంబంలో వివాదాలు ముదిరాయని.. సర్దుకు పోవచ్చు కదా అని అనిల్ ను కూడా అడిగానని ఆయన అన్నారు. జగన్ వద్దకెళ్లి ‘పాపకు రాజ్యసభ టికెట్ ఇవ్వచ్చు కదా’ అంటే ‘ఒక ఇంట్లో ఒక్కరే రాజకీయాల్లో ఉండాలని’ జగన్ చెప్పినట్లుగా బాలినేని వెల్లడించారు. కేవలం తన చెల్లెలిని రాజకీయ పదవులకు దూరం పెట్టడానికి మాత్రమే జగన తనకు తాను ఈ నైతిక విలువలను తయారుచేసుకున్నారని మనకు అర్థమవుతుంది.
2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ.. కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో కూడా జగన్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన తాను బాలినేనికి చెపపిన సూడో కుహనా నైతిక విలువలను ఇంకాస్త ఇంప్రొవైజ్ చేశారు. ఒక కుటుంబంలో ఒక తరంలో ఒక్కరికి మాత్రమే రాజకీయ అవకాశం ఇవ్వాలనేది తాను నియమంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అందువల్లనే షర్మిలకు ఎంపీ పదవి ఇవ్వలేదని, వ్యాపారాలు చేసుకోమని చెప్పానని, కావలిస్తే సహకారం అందిస్తానని అన్నానని ఆయన చెప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లోనే పెద్దిరెడ్డి సోదరులకు, బొత్స దంపతులకు, అంబటి సోదరులకు ఇలా.. తన నియమాన్ని ఆయన ఉల్లంఘించి అనేక మంది టికెట్లు ఇచ్చారు. చెల్లెలుకు రిక్తహస్తం చూపించడానికి మాత్రమే.. చెల్లెలును తన రాజకీయ విజయానికి వాడుకున్న తర్వాత దూరం పెట్టడానికి మాత్రమే ఆయన ఇలాంటి అవకాశవాద నైతికవిలువలను నమ్మినట్టుగా కనిపిస్తోంది.
జగన్‌వి అన్నీ అవకాశవాద నైతిక విలువలే!
Sunday, November 24, 2024