వైసీపీ కొత్త ఎత్తుగడ : అదృశ్యం అయిపోదాం…

Saturday, November 23, 2024

తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెడితే .. ఆయా కార్యకర్తలను హఠాత్తుగా అదృశ్యం చేసేస్తోంది. పోలీసులు కేసు పెట్టగానే.. దానికి భయపడి పరారీ అయిపోవడం గురించి కాదు. పోలీసు విచారణకు కూడా  హాజరై.. వారినుంచి 41ఏ నోటీసు కూడా తీసుకున్న తరువాత.. పోలీసు స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లకుండా అదృశ్యం అయిపోతున్నారు. బాహ్య ప్రపంచానికి మాత్రం ‘‘విచారణ నిమిత్తం ఫలానా వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతను అదృశ్యం అయ్యాడు’’ అనేది మాత్రమే కనిపిస్తోంది. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం అనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియా కార్యకర్తలు అనే ముసుగులో అత్యంత అసభ్యమైన అసహ్యమైన పోస్టులు పెడుతూ చెలరేగుతున్న వారిపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. కేసులు వరకు వాస్తవమే అయినప్పటికీ.. చాలా సందర్భాలలో నిందితులను పోలీసుస్టేషనుకు తీసుకువచ్చి హెచ్చరించి, 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. వ్యవహారం అంతటితో ముగిస్తే ఇక గొడవేముంది. పోలీసు స్టేషను నుంచి బయటకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు నేరుగా ఇంటికి వెళ్లడం లేదు. ఒక వ్యూహం ప్రకారం.. అజ్ఞాతంలోకి వెళుతున్నారు.

పోలీసులు తీసుకెళ్లిన తర్వాత తమ ఇంట్లోని వ్యక్తి ఏమయ్యాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. కోర్టు వారు పోలీసులను పిలిచి విచారణకు తీసుకువెళ్లిన వ్యక్తి ఏమయ్యాడంటే.. పోలీసులు బిక్కమొహం వేయాల్సి వస్తోంది. నోటీసు ఇచ్చి వదిలేసాం అని చెబుతోంటే.. సదరు నిందితుడి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదు. పోలీసులు తీసుకువెళ్లినప్పటినుంచి వారు కనిపించడమే లేదని ఆరోపిస్తున్నారు.

మీరు వదిలేసినట్టు ఆధారాలేమిటి.. నాలుగు రోజుల్లోగా అదృశ్యం అయిన వ్యక్తిని తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టండి.. అని కోర్టులు ఆజ్ఞాపిస్తున్నాయి. తప్పిపోయిన వాడిని పోలీసులు వెతకగలరు గానీ.. కావాలని పారిపోయిన వారిని ఎలా వెతుకుతారు.దీంతో వారికి చికాకు తప్పడం లేదు. పోలీసులు వారిని మాయం చేశారనే నింద అదనం.

ఆతర్వాత సదరు నిందితుడు కొన్నిరోజుల తర్వాత ప్రత్యక్షమై.. పోలీసులకు భయపడి పారిపోయినట్లుగా సింపుల్ గా చెప్పేసి తప్పించుకోవచ్చు. కానీ ఈలోగా ప్రభుత్వం మీద, పోలీసుల మీద మనుషుల్ని మాయం చేసేస్తున్నారని నిందలు వేస్తూ గడిపేయవచ్చు. ఇదే సరికొత్త వ్యూహంగా వైఎస్సార్ కాంగ్రెస్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles