విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. తమకు మెజారిటీ స్థానిక ప్రజాప్రతినిధుల బలం ఉన్నది కాబట్టి, జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత.. విశాఖ ఎమ్మెల్సీ సీటును బొత్స గెలుచుకోవడం ద్వారా కాస్త ఊరట పొందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మళ్ళీ నెగ్గితే ఇంకాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఉత్సాహపడ్డారు. కానీ తాజాగా హైకోర్టు తీర్పుతో వారికి ఉత్సాహభంగం తప్పలేదు! ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు పై వేసిన అనర్హత వేటు చెల్లదని.. ఆయన సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఎమ్మెల్సీగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అశనిపాతం ఎదురయింది.
విజయనగరం జిల్లాలో వైసిపి కి ఉన్న కీలక నాయకుల్లో ఇందుకూరి రఘురాజు కూడా ఒకరు. 2019 ఎన్నికల్లోనే ఆయన టికెట్ ఆశించినప్పటికీ.. జగన్ నిరాకరించారు. చాలా పట్టుబట్టిన తరువాత రఘురాజును ఎమ్మెల్సీ చేశారు. 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టారు. పైగా ఆయన అనుచరులు తెలుగుదేశంలో చేరారని.. ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారని మండలి చైర్మన్ మోషెన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన వైసిపి మనిషే గనుక రఘురాజుపై వేటు వేయడం ఆటోమేటిగ్గా జరిగిపోయింది. ఖాళీ చూపించడంతో.. ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. స్థానిక ప్రతినిధుల్లో తమకు బలం ఉన్నది గనుక నెగ్గుతాం అనే భావన వైసీపీకి ఉంది. గెలిచి తీరుతాం అనే ఉత్సాహంలో జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేరును ప్రకటించేశారు. ఈలోగా హై కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది.
తనపై వేసిన అనర్హత వేటును రాఘురాజు సవాలు చేయడంతో ఈ తీర్పు వచ్చింది. ఆయనకు తన వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వేటు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. రఘురాజుని ఎమ్మెల్సీ గా కొనసాగించాలని చెప్పింది. దీంతో ఉపఎన్నిక ఆగినట్టే. పాపం వైసిపి నాయకులకు ఉత్సాహ భంగం అయిపోయింది.