సోషల్ మీడియాలో చెలరేగుతూ అనేక దుర్మార్గమైన పోస్టులు పెట్టిన వ్యక్తి పోలీసుల చేజిక్కిన తర్రవాత కూడా, ఇంటికి వచ్చిన అల్లుడు తిరిగి వెళ్లినట్టుగా నింపాదిగా వెళ్లిపోవడం ఏమిటి? అనేక కేసులతో సంబంధం ఉన్న నిందితుడిని కేవలం ఒక 41ఏ నోటీసు ఇవ్వడం ద్వారా పోలీసులు ఎలా వెనక్కు తిప్పిపంపేశారు? అదే నిందితుడు మీద వేరే పోలీసు స్టేషన్ లో కూడా కేసులున్నాయి. అతడిని తమ అదుపులోకి తీసుకుని వెళ్లడానికి అక్కడి పోలీసులు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఈలోగా నిందితుడిని తిప్పి పంపేయయడం కడప పోలీసులకు మాత్రమే చెల్లింది. అయితే దీని వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులను భయపెట్టగల శక్తుల జోక్యం కూడా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
వర్రా రవీందర్ రెడ్డి అనే పులివెందులకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినందునకు అరెస్టు అయ్యారు. ఆయన మీద జిల్లాలోనే అనేక కేసులు ఉన్నాయి. చంద్రబాబు, పవన్, వంగలపూడి అనిత లపై అభ్యంతరకరమైన భాషలో పోస్టులు పెట్టిన చరిత్ర ఉంది. అలాగే వైఎస్ కుటుంబంలోనే జగన్ వ్యతిరేక వర్గం- అనగా, వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీత లక్ష్యంగా వారిని బద్నాం చేస్తూ అనేక పోస్టులు పెట్టిన చరిత్ర ఉంది. ఆయనను కడప చిన్నచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని, 41ఏ నోటీసులు ఇచ్చి తిప్పిపంపారు. అయితే ప్రొద్దుటూరులో కూడా ఆయన మీద కేసులు ఉండడంతో అక్కడి పోలీసులు వచ్చినప్పటికీ వారికి అప్పగించకుండా పంపేయడం వివాదం అయింది. పోలీసులు అంత అతి ఎందుకు చేశారంటే..
సదరు వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ భారతికి పీఏ. ఆమె కళ్లలో ఆనందం చూడడం కోసమే ఆమె కుటుంబ వ్యవహారాల్లో కూడా తలదూర్చి విజయమ్మ, షర్మిలలపై పోస్టులు పెట్టినట్టు సమాచారం. వైఎస్ భారతి గత అయిదేళ్ల జగన్ పాలన కాలంలో రాష్ట్రంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళ కాబట్టి ఆమె పీఏ గా వర్రా రవీందర్ రెడ్డికూడా రెచ్చిపోతూ వచ్చారు. తీరా ఇప్పుడు అరెస్టు కాగానే.. ఏకంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెరమీదకు వచ్చారు. వర్రాను తక్షణం విడిచిపెట్టాల్సిందిగా ఆయన పోలీసులను హెచ్చరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ దెబ్బతో ఆయనకు కేవలం నోటీసులు ఇచ్చి పంపేశారని అంటున్నారు. ఆగ్రహించిన ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని, ఈ కారణంతో ఏకంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజుమీద కూడా వేటు వేసినట్టు తెలుస్తోంది. అసలే వైఎస్ భారతి పీఏ, ఆపై అవినాస్ రెడ్డి రంగంలోకి వచ్చి నేరుగా హెచ్చరించారు.. ఇక పోలీసులు ఆమాత్రం భయపడకుండా ఉంటారా? అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.
అసలే వైఎస్ భారతి పిఏ.. ఆపై అవినాష్ రెడ్డి ఫోన్..
Saturday, November 23, 2024