తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు గురించి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో వాసంశెట్టి సుభాష్ ను సీఎం మందలించడం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఇది ఒక పరిణామం కాగా.. హోం మంత్రి వంగలపూడి అనిత గురించి పరోక్షంగా పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు మరొక ఎత్తు. పోలీసుల్లో ఉండే అలసత్వం, నిర్లక్ష్యం, పట్టింపులేని ధోరణి, అవినీతి వీటన్నింటికీ మంత్రి బాధ్యత ఉందని అర్థం వచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను హోం మంత్రిని అయితే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించిన ఆయన పరోక్షంగా ఇప్పుడున్న హోం మంత్రి అచేతనత్వాన్ని ప్రస్తావించారు. ఇది రెండో పరిణామం.
ఈ రెండు పరిణామాలు కూడా రాజకీయంగా అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలకు దారితీయాలి. అసంతృప్తులకు బీజం వేయాలి. ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేలా ప్రేరేపించాలి. కానీ అలా జరగడం లేదు. టార్గెట్ అయిన మంత్రులు ఇద్దరూ కూడా చాలా పాజిటివ్ ధోరణిలోనే తీసుకుంటున్నారు. తమను తిట్టినందుకు, తప్పుపట్టినందుకు వారు బాధపడడం లేదు. జాగ్రత్త పడుతున్నారు. నిజంగానే తమ పద్ధతిని, పని తీరును మార్చుకోవాల్సి ఉన్నదనే వాస్తవాన్ని వారు అంగీకరిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామంగా మనం గుర్తించాలి. తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, ఎన్డీయే కూటమి పరిపాలన సజావుగా నడవడానికి కూడా ఈ పాజిటివ్ ధోరణి మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పట్ల వంగలపూడి అనిత స్పందించినప్పుడు.. ఆయన మాటలను పాజిటివ్ గానే తీసుకుంటున్నట్టు చెప్పారు. సోషల్ మీడియా దుర్మార్గాలకు బలవుతున్న వారిలో తాను కూడా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. వాసంశెట్టి సుభాష్ విషయంలో ఆయన ఇంకా గొప్పగా స్పందించారు. చంద్రబాబునాయుడు తనకు తండ్రి వంటి వారని.. ఆయన మందలించడం అనేది తనను సరైన దారిలో పెట్టడానికే అని సుభాష్ మాట్లాడడం ప్రశంసార్హం. మంచి నాయకులను తయారుచేసే అనుభవశాలి చంద్రబాబు అని సుభాష్ కితాబు ఇస్తున్నారు. వార్డు సభ్యుడిగా కూడా పోటీచేయని తనను ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారని, మంచి చెడు చెప్పినప్పుడు తప్పులు దిద్దుకుంటానని మెరుగుపడతానని ఆయన అంటున్నారు.
ఇద్దరు మంత్రులకు నెగటివ్ గా మాటలు రాగానే.. జగన్మోహన్ రెడ్డి కరపత్రిక మీడియా.. రెచ్చిపోయి వక్రప్రచారాలకు తెగబడుతోంది. అయితే ఈ ఇద్దరు మంత్రులు కూడా పాజిటివ్ గా స్పందిస్తుండడం వలన.. వారి కుట్రలకు ఫలితం దక్కడం లేదు.
ఈ పాజిటివ్ ధోరణి పార్టీకి, ప్రభుత్వానికీ మంచిదే!
Thursday, November 21, 2024