జగన్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ తమ్ముళ్లే, మంచివాళ్లే సౌమ్యులే! కానీ ప్రజాస్వామ్య నిర్వచనంలో అందరూ సమానులే.. కొందరు మాత్రం అధిక సమానులు అన్నట్టుగా.. జగనన్న సామ్రాజ్యంలో కూడా అందరూ తమ్ముళ్లే కొందరు మాత్రం ప్రియమైన తమ్ముళ్లు.. ప్రేమాస్పదమైన తమ్ముళ్లు! అలాంటి ప్రియమైన తమ్ముళ్లలో.. ఇటీవలి కాలంలో న్యూడ్ వీడియోలతో గతంలో కంటె ఎక్కువ పాపులర్ అయిన నాయకుడు ఎమ్మెల్సీ అనంత బాబు కూడా. సదరు జగన్ తమ్ముడి పట్ల ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ కార్యకర్తల్లో తిరుగుబాటు మొదలవుతోంది.
ఎమ్మెల్సీ అనంతబాబు.. సహజంగానే పాపులర్ నాయకుడు. జగన్ కు అత్యంత ప్రీతిపాత్రమైన వారిలో ఒకడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎలాంటి సమయంలోనైనా సరే.. అపాయింట్‌మెంట్ లేకుండా అయినా సరే.. అనంతబాబు జగన్ వద్దకు వెళ్లిపోగలరని ఆయనకు పార్టీలో గుర్తింపు ఉంది. అయితే పార్టీలో మాత్రమే ఉన్న ఆయన పాపులారిటీ.. రాష్ట్రవ్యాప్తంగా మరోకోణంలో అయింది. దళితుడైన తన కారు డ్రైవరును చంపేసి, వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసిన మహానుభావుడిగా అనంతబాబును రాష్ట్ర ప్రజలందరూ నిన్నటిదాకా గుర్తుంచుకుంటూ వచ్చారు. ఈ కేసులో ఆయన అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లారు. అయినా సరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద కించిత్తు క్రమశిక్షణ చర్య తీసుకోలేదు.
సరికదా.. జైలునుంచి బెయిలు మీద విడుదలైన తర్వాత.. యుద్ధంలో గెలిచివచ్చిన వీరుడిని సత్కరించిన తరహాలో.. పెద్ద స్థాయి ఊరేగింపులతో గజమాలలతో వైసీపీ వారంతా హడావుడి చేశారు. అలా శవాన్ని డోర్ డెలివరీ చేసిన నేతగా ఆయన మొన్నటిదాకా పాపులర్ అయ్యారు. తర్వాత ఇంకా పాపులారిటీ లభించింది. మహిళలకు ఫోను చేసి ఆయన మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ దెబ్బతో ఆయన పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంత జరిగినా జగన్ తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.
అయితే సదరు అనంతబాబు నాయకత్వంలో తాము పనిచేయబోం అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. న్యూడ్ వీడియోల నాయకుడు తమకు వద్దు అంటున్నారు. అనంతబాబు ఆగడాలపై మండిపడుతున్నారు. అనంతబాబును మార్చకపోతే.. రెలే నిరాహార దీక్షలు కూడా చేస్తాం అంటున్నారు. అనంతబాబును వదులుకోలేని స్థితిలో ఉన్న జగన్ వీరి మోర ఆలకిస్తారా? అయినా ఒక పార్టీలో అంతర్గత వ్యవహారం కోసం రెలే నిరాహార దీక్షలు కూడా జరగడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.