భట్టి, లోకేష్ ఫార్ములా ఫాలో కానున్న కేటీఆర్!

Saturday, November 23, 2024

తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. పాదయాత్ర సాగించడం ఒక సెంటిమెంటు మార్గం అనే ముద్ర పడిపోయింది. 2004 ఎన్నికలకు పూర్వం వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల వద్ద ప్రారంభించి ఇచ్ఛాపురం వరకు సాగించిన పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు. లేటెస్టుగా గమనిస్తే.. నారా లోకేష్ ఏపీలో సుదీర్ఘమైన పాదయాత్ర సాగించారు. కుప్పం నుంచి ఉత్తరాంధ్ర వరకు యాత్ర నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే.. పాదయాత్ర చేసిన వారు.. గెలిచి అధికారంలోకి వస్తారనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా పాదయాత్ర మార్గాన్ని అనుసరించి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగునాట రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్ గా తయారైన మాట వాస్తవం. రెండు దశాబ్దాల కాలాన్ని గమనిస్తే.. ముందే చెప్పుకున్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు.  చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర నిర్వహించి.. అధికారంలోకి వచ్చారు. 2014లో అధికారం సునాయాసంగా దక్కుతుందని కలగని భంగపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తర్వాత పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు తెలంగాణ రాజకీయాలను గమనించినా కూడా.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం కాంగ్రెసు పార్టీ తరఫున మల్లు భట్టి విక్రమార్క సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించారు. అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో వైఎస్ షర్మిల పాదయాత్ర ఒక్కటే ఎటూ కాకుండా నిష్ఫలమైంది. పైగా ఆమె పాదయాత్రను అనేక ఇంటర్వెల్స్ తో రకరకాలుగా నిర్వహించారు.
జాతకాలను, సెంటిమెంట్లను చాలా ప్రబలంగా నమ్మే కల్వకుంట్ల వారికి ఇప్పుడు ఈ పాదయాత్ర సెంటిమెంటు మీదకు గాలి మళ్లినట్టుంది. భారాస కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించేశారు. పార్టీ కార్యకర్తలంతా ఆయనను కోరుతున్నారట. అందుకని పాదయాత్ర చేయబోతున్నట్టు చెప్పారు. కేసీఆర్ కు విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయి. యజ్ఞయాగాదిక్రతువులు, హోమాలు అనేకం చేయిస్తుంటారు. అవే గెలిపిస్తాయని నమ్ముతుంటారు కూడా! 2018కి ముందు చేయించిన హోమమే 2023 ఎన్నికల ముందు చేసినా ఓడిపోయారు. ఆ సెంటిమెంటు వదిలేసి పాదయాత్ర సెంటిమెంటును అనుసరించబోతున్నట్టుంది. ఏడాదిగా అసలు బయటికార్యక్రమాలకే కేసీఆర్ రావడం లేదు. కాబట్టి కేటీఆరే పాదయాత్ర చేయాలనుకుంటున్నారేమోనని.. వఅయినా అధికారంలోకి రావడానికి పాదయాత్ర సెంటిమెంటును నమ్ముకోవడం కంటె.. ప్రజల మనసులను గెలుచుకునేలా పనిచేయడం ముఖ్యమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles