నిండా రెండు నెలలు కూడా కాలేదు. ఇడుపులపాయంలోని వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్ విజయమ్మ చేతిలో బైబిలుతో రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించి, కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముద్దు పెట్టుకుని తన ప్రేమను వ్యక్తం చేశారు. తన పరువు మొత్తం బజార్న పడడానికి, తన నాటకం మొత్తం బట్టబయలు కావడానికి.. అమ్మ విజయమ్మ రూపంలోనే బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడుతుందని జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవినుంచి ఎంతో అయిష్టంగా వేదికమీదనే రాజీనామా ప్రకటించిన విజయమ్మ.. ఆ తర్వాత కూడా కలిసిన ప్రతిసారీ.. ప్రేమగా ఆప్యాయతతో ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ.. ఈ రేంజిలో తన మీద విరుచుకుపడతారని ఆయన ఊహకు అంది ఉండదు. జగన్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం విషయంలో సాక్షాత్తూ విజయమ్మ రంగంలోకి వచ్చిన తర్వాత.. ఇక ఎవ్వరి మాటలకు, ఎవ్వరి వాదనలకు విలువ ఉండదనేది అందరూ ఆమోదించవలసిన సంగతి. ఆమె చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఉన్న ఇద్దరు బిడ్డలు తనకు సమానమేనని అంటూనే.. ఒక బిడ్డకు మరొక బిడ్డ అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కదా.. అని విజయమ్మ అనడం గమనించాలి.
జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం తన చేతికిందనే ఉంచుకోవడం తప్ప తన జీవితానికి మరో పరమావధి లేదన్నట్టుగా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన షేర్లు మొత్తం తిరిగి లాక్కోవడానికి ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసిన ఆయన ఇంటిగొడవను రచ్చకీడ్చారు. ఆ వివాదంపై షర్మిల మాట్లాడడం ప్రారంభించిన తరువాత.. తన పార్టీలో మిగిలిన ఉన్న నాయకులు అందరితోనూ షర్మిలను నానా మాటలూ అనిపిస్తున్నారు.
ఇది బహుశా జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు అని అనుకోవాలి.
స్వయంగా ఆయన మాత్రమే చెల్లెలితో వివాదం గురించి మాట్లాడి ఉంటే మరో రకంగా ఉండేది. అలా కాకుండా వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి.. ఇంకా అంతకంటె తక్కువ స్థాయికి చెందిన ప్రతి ఒక్కరితోనూ షర్మిలమీద విమర్శలు చేయించారు. ఇదంతా కలిపి విజయమ్మకు ఒళ్లు మండినట్టుగా కనిపిస్తోంది.
జగన్ వరకు ఓకే.. ప్రతి ఒక్కరూ వచ్చి తన కూతురును నానా మాటలు అంటుండేసరికి ఆమె బహిరంగ లేఖ రాసి.. అందరినీ నోరుమూసుకోమని చాలా గౌరవంగా చెప్పారు. అన్నాచెల్లెళ్లు తేల్చుకోగలరు అని కూడా అన్నారు. అన్న జగన్ తప్పు చేస్తున్నాడని స్పష్టం చేశారు. ఆమె నేరుగా తెరపైకి వచ్చి తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని జగన్ ఊహించి ఉండకపోవచ్చు. ఆ బ్రహ్మాస్త్రం మీద పడేసరికి ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.