ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం వలన, ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన అనుభవం ఉన్నది గనుక.. ఆ పార్టీతో అనుబంధాన్ని ఆయన వాడుకున్నారా? లేదా, ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీతో ఆయనకు కూడా అనుచితమైన వివాహేతర సంబంధం ఉన్నది గనుక.. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాడుకున్నదా? అనేది తేల్చిచెప్పడం కష్టం. మొత్తానికి నటి కాదంబరి జత్వానీ కేసు, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కు గట్టిగానే చుట్టుకుంది. ఆయన ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. తన అరెస్టు అక్రమం అని, రిమాండు సరికాదని, రిమాండు ఉత్తర్వులను సవాలు చేస్తూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టును ఆశ్రయించారు గానీ.. ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
కుక్కల విద్యాసాగర్ ఇప్పుడు సంకటంలో పడ్డారు. కాదంబరీ జత్వానీ తనను పెళ్లి చేసుకోమని అడుగుతున్నందుకు ఆమెను వదిలించుకోవాలని ఆయన అనుకున్నారు. అందుకు పార్టీ పెద్దలను ఆశ్రయించారు. ఈలోగా కాదంబరి జత్వానీ ని కేసులో ఇరికించడం వైఎస్సార్ కాంగ్రెస పార్టీకి కూడా అవసరంగా మారింది. నవీన్ జిందాల్ తో ఆమెకున్న తగాదాను తెలుసుకుని పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. తమ కనుసన్నల్లో పనిచేసే పోలీసు ఉన్నతాధికారుల్ని పురమాయించారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరానా తాతా, విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ అధికారులు తమ తెలివితేటలను ఉపయోగించారు. మొత్తానికి కాదంబరి జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ తో కేసు పెట్టించి, ఆమెని కుటుంబం సహా అరెస్టు చేసి వేధించారు.
ఈ వ్యవహారం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తెరమీదకు వచ్చింది. తనకు న్యాయం కావాలని కాదంబరి జత్వానీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. జగన్ పాలనలో పోలీసులు ఎలా దుర్మార్గంగా చెలరేగారో ప్రజలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి ఆ ముగ్గురు ఐపీఎస్ లు కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. కేసులో కీలకమైన ఇరుసు వంటి వ్యక్తి కుక్కల విద్యాసాగర్! ఆయన ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. తాజాగా రిమాండును సవాలు చేసిన ఆయన పిటిషన్ బుట్టదాఖలైంది.
కుక్కల విద్యాసాగర్ సేఫ్ గా బయటకు రావాలంటే.. నోరు విప్పి అసలు ఏం జరిగిందో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా గుంభనంగా ఉంటూ, నిజాలు చెప్పకుండా తప్పించుకోగలం అనుకుంటే ఇబ్బందేనని వ్యాఖ్యానిస్తున్నారు. మరి కుక్కలకు ఈ విషయం బోధపడుతుందో లేదో!?