జగన్ తాజాగా తాను కక్ష కట్టిన వైఎస్ షర్మిల మీదకు రోజుకు ఒక పెద్ద నాయకుడిని దండయాత్రకు పంపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా తెరమీదకు వచ్చిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. షర్మిల మీద ఆయన చేసిన ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. ‘షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సరిగ్గా ఈ పాయింటు మీదనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
విజయసాయిరెడ్డి మాటలు నిజమే అని కాసేపు అనుకుందాం. వైఎస్ రష్మిలకు అధికార దాహం ఉన్నదనే అనుకుందాం. అలా అధికార పదవులను ఆశించడం అనేది ఆమె చేసిన తప్పా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడానికి తన శాయశక్తులా పనిచేసిన షర్మిల.. ఎన్నికల అనంతరం తననున రాజ్యసభ సభ్యురాలిగా ఎంపీ చేయాలని కోరినట్టుగా అప్పట్లోనే వినిపించింది. అయితే.. జగన్ ఆమెకు ఎంపీ పదవి ఇవ్వకుండా వంచించారని కూడా వినిపించింది.
నిజానికి ఆమె ఎంపీగా లోక్ సభ ఎన్నికల బరిలోనే దిగాలని అనుకోగా, అప్పట్లో ప్రచారానికి అవసరం ఉంటుందని అంటూ ఆమెను పోటీచేయించలేదని.. తీరా ఎన్నికలు పూర్తయ్యాక రాజ్యసభ పదవి కూడా ఇవ్వకుండా మోసం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అన్నాచెల్లెళ్ల మధ్య తగాదా ఏర్పడడానికి ఆస్తుల పంపకం పెద్ద పాయింట్ కాదని, రాజకీయ పదవి కారణంగానే అసలు గొడవ జరిగిందని అంతా అనుకున్నారు. అందుకే ఆమె తెలంగాణకు వెళ్లి అక్కడ సొంతంగా పార్టీ పెట్టుకున్నారని కూడా అనుకున్నారు.
2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారింది. షర్మిల మళ్లీ ఏపీ ఎన్నికల బరిలోకే వచ్చారు. పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ మీద నిశిత విమర్శలతో విరుచుకుపడ్డారు. షర్మిలను తాను రాజకీయ పదవులకు దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీ తరఫున ఏదో నైతిక విలువలు పాటిస్తున్న మహానుభావుడిలాగా.. ఒక కొత్త నైతిక సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ఒక కుటుంబంలో ఒక తరంలో ఒకరికి మాత్రమే టికెట్’’ అంటూ ప్రవచించారు. కేవలం చెల్లెలికి టికెట్ ఇవ్వకపోవడాన్ని సమర్థించుకోవడానికే అలాంటి బూటకపు మాటలు చెప్పుకొచ్చారు జగన్.
అయితే తన రూలును తానే ఉల్లంఘిస్తూ.. బొత్స సత్యనారాయణ ఆయన భార్య ఝాన్సీలకు, అంబటి రాంబాబు, ఆయన తమ్ముడు మురళిలకు కూడా టికెట్లు ఇచ్చారు జగన్! ఇక తండ్రీకొడుకులకు టికెట్లు అనేది లెక్కలేదు. కేవలం చెల్లెలిని దూరం పెట్టడానికి ఒక సిద్ధాంతం ప్రతిపాదించిన జగన్మోహన్ రెడ్డికి అసలు నైతికత ఉందా? అనేది ప్రజల ప్రశ్న.
వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినందుకు.. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకున్నప్పుడు.. ఆయన కూతురు అయిన తాను కనీసం ఎంపీ కావాలని షర్మిల అనుకోవడం తప్పవుతుందా? అనే ప్రశ్న ప్రజల్లో వస్తోంది. దీనికి జవాబు చెప్పలేకపోతే.. జగన్ అవకాశవాదాన్ని ప్రజలు అసహ్యించుకుంటారు. ఆయనకు నైతికత లేదని నమ్ముతారు.