అయితే ఈ వివాదాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల మాత్రం గొడవను ఒంటరిగా ఎదుర్కొంటున్నారు అని… అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వివాదాన్ని ఒంటరిగా ఎదుర్కోలేకపోతున్నారు అని మనకు అర్థమవుతుంది. ఆయనలోని పిరికితనం, బేలతనం, సమస్త అవ లక్షణాలు ఈ ఒక్క వివాదం లోనే బయటకు వస్తున్నాయి. తన పార్టీకి చెందిన నాయకులందరినీ కూడా తనకు మద్దతుగా మాట్లాడమంటూ.. వైఎస్ షర్మిల మీద బురద చల్లమని ప్రేరేపిస్తూ జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారు.
‘‘పందులు మాత్రమే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది’’ అనే రజనీకాంత్ డైలాగును జగన్మోహన్ రెడ్డి పదేపదే వాడుకున్నారు. ఎన్నికలలో పొత్తులు పెట్టుకునే పార్టీలను పందులుగా వ్యవహరిస్తూ తాను సింహం గనుక, ఒంటరిగా మాత్రమే బరిలోకి దిగుతానని ఆయన వందిమాగధులతో తనను గతంలో పొగిడించుకున్నారు. తీరా ఇప్పుడు చెల్లెలితో వచ్చిన వ్యక్తిగత వివాదం విషయంలో పార్టీలో ఉండే నాయకులు అందరినీ తనకు సపోర్టు రమ్మని బతిమాలుతున్నారు. వారిద్వారా గుంపులుగా షర్మిలను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరో కవి చెప్పినట్టుగా ‘‘ప్రపంచం బాధ అంతా శ్రీ శ్రీ బాధ! అయితే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’’ అనే వాక్యాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో గుర్తుకు వస్తున్నాయి. జగన్- నా ఏడుపును మీరందరూ కలిసి ఏడవండి అని పార్టీ వారిని ఆదేశిస్తున్నట్లుగా ఒత్తిడి చేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితమై కూర్చున్న వైసిపి నాయకులు పలువురు కూడా హఠాత్తుగా ఇప్పుడు తెరమీదికి వచ్చి షర్మిలను నానారకాలుగా తిడుతున్నారు.
చంద్రబాబు నాయుడుతో కలిసి అన్నయ్య బెయిలు రద్దు కావడానికి కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇలా తన ఏడుపు అందరితో ఏడిపించడం ద్వారా ఏమి సాధించగలరో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకసారి కోర్టు గడప తొక్కిన తర్వాత ఈ రకంగా నలుగురితో మాట్లాడించడం అనేది కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయగలదని జగన్ ఆశిస్తే పొరబడినట్లే. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు తీర్పు వస్తుందని అంతా విశ్వసిస్తున్నారు.