వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా తానొక్కడు మాత్రమే రాజకీయాలలో చలామణి కావాలని జగన్మోహన్ రెడ్డికి అత్యాశ. వైయస్ రాజశేఖర్ రెడ్డికి కొడుకు గనుక తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ఆయన.. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డికి కూతురు గనుక తాను కనీసం ఎంపీ కావాలని షర్మిల భావించినా కూడా అది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అసంబద్దం. షర్మిల కూడా రాజకీయ రంగంలో క్రియాశీలంగా చట్టబద్ధమైన రాజ్యాంగ పదవులలో ఉండడం అనే పరిణామాన్ని జగన్ ఊహించలేకపోయారు, సహించలేకపోయారు. అందుకే ఆమె కోరికను మన్నించలేదు. 2019 ఎన్నికల ప్రచారానికి వాడుకున్న తర్వాత దాదాపుగా వెళ్లగొట్టారు. అంతిమంగా ఇప్పుడున్న దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నించిన షర్మిల, తాను కూడా ఎంపీ కావాలని కోరుకున్నారు. కానీ జగన్ మాత్రం ఆమె కోరినట్లుగా రాజ్యసభకు పంపడానికి అంగీకరించలేదు. తమ పార్టీకి దక్కిన రాజ్యసభ సీట్లను వివిధ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. ఆ పదవులను వందల కోట్లకు అమ్ముకున్నారనే విమర్శలను కూడా మూటకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చెల్లెలితో విభేదాలు మాత్రం ముదిరాయి. తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి చెల్లెలు షర్మిల పక్కలో బల్లెం లాగా మారారు.
షర్మిలలోని రాజకీయ ఆకాంక్ష బహిరంగం కావడంతో జగన్మోహన్ రెడ్డి ఒక చేతగాని సిద్ధాంతాన్ని బయటకు ప్రతిపాదించారు. ఒక కుటుంబంలో ఒక తరంలో ఒక వ్యక్తికి మాత్రమే చట్టసభల ప్రతినిధిగా పదవి ఉండాలనే ఒక బూటకపు సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించారు. ఆయన తండ్రి వైఎస్సార్ కూడా ఎన్నడూ పాటించని సిద్ధాంతం అది. కేవలం తన చెల్లెల్ని రాజ్యసభకు పంపకపోవడాన్ని సమర్ధించుకోవడానికి మాత్రమే అలాంటి సిద్ధాంతం చెప్పారు. అంతేతప్ప దానిపై ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ప్రజలందరికీ అర్థమైంది. ఒక కుటుంబంలో తండ్రీ కొడుకుల రూపేనా అనేక కుటుంబాలకు పదవులు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి షర్మిలను పదవులకు దూరం పెట్టడానికి ‘‘ఒక కుటుంబంలో ఒకతరంలో ఒకరికి మాత్రమే’’ అనే ప్రత్యేకమైన నినాదాన్ని తెచ్చారు. అలాగని కనీసం తన తల్లి వైఎస్ విజయమ్మకు కూడా ఎలాంటి రాజకీయ పదవీ ఇవ్వలేదు. పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయే వాతావరణం కల్పించారు. ఇలా తాను తప్ప తన సొంత కుటుంబంలో ఎవ్వరూ కూడా ఎదగకూడదు అనే దుర్మార్గమైన భావనతో వ్యవహరించడం వల్లనే జగన్ కు ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆయన తన ఆలోచన మార్చుకోవాలని అనుకుంటున్నారు.
జగన్ ఓర్వలేని బుద్ధులే ఈ దుస్థితికి కారణం!
Tuesday, December 9, 2025
