మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు కొట్టారు. ఒక్క నిర్ణయంతో అటు తల్లితోనూ, ఇటు చెల్లితోనూ వైరం పెంచుకున్నారు. ఒకే నిర్ణయంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల తగాదాలు ఉన్నాయనే సంగతి ఒక పుకారుగా కాకుండా.. ప్రజలకు స్పష్టత ఇచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని నిరూపించారు. అయితే చెల్లెలిని కార్నర్ చేయడానికి లేదా ఆమెకు ఎంఓయు ద్వారా వాటాలు ఇచ్చిన ఆస్తులను ఎగ్గొట్టడానికి జగన్ ఈ ప్రయత్నం చేస్తుండవచ్చు. ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లడం వలన కొంత ఫలితం దక్కవచ్చు. కానీ తల్లి వైఎస్ విజయమ్మకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ షేర్లను రద్దు చేయడం అనేది సాంకేతికంగా అంత సులువుగా సాధ్యమయ్యేది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎంఓయును రద్దు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బోలెడు కారణాలు చూపించవచ్చు. ప్రేమ ఆప్యాయతల కోసం ఆ వాటాలు ఇస్తున్నట్లుగా ఎంఓయులో కూడా స్పష్టంగానే పేర్కొన్నారు. కానీ ఆ ఎం ఓ యు చెల్లెలు షర్మిలకు వివిధ ఆస్తులలో ఇచ్చే వాటాలకు సంబంధించినది మాత్రమే. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ షేర్ల వ్యవహారం అలాంటిది కాదు.
చెల్లెలుకు రాసిచ్చిన ఎంఓయులో అన్ని ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు మాత్రమే పేర్కొన్నారు. ఈడీ కేసులు ఎప్పటికి క్లియర్ అవుతాయో ఆస్తుల మీద స్పష్టమైన యాజమాన్య హక్కులు ఎప్పటికీ వస్తాయో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ కేసులు క్లియర్ అయిన తర్వాత అప్పచెప్పే లాగా మాత్రమే ఎంవోయూ కుదిరింది. అయితే జగన్ వర్గం చెబుతున్న వివరణ ప్రకారం- అప్పటిదాకా షర్మిలకు నమ్మకం కలగడం కోసం తల్లి పేరిట సరస్వతీ పవర్ షేర్లు గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. చెల్లెలు నుంచి ప్రేమ ఆప్యాయతలు లేకుండా పోయాయి గనుక, తల్లికి ఇచ్చిన షేర్లు ఆయన ఎలా రద్దు చేయగలరు అనేది అర్థం కావడం లేదు! ఎంఓయూ విషయంలో ఆయన లీగల్ కార్యాచరణ ఉపయోగపడుతుందేమో కానీ తల్లికి ఇచ్చిన షేర్లను రద్దు చేయలేరు అని న్యాయానిపుణులు చెబుతున్నారు. ఆమె తన పట్ల ప్రేమ చూపించడం లేదు అని జగన్ క్లెయిం చేయగల అవకాశం లేదు. ఇటీవల రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద కూడా కొడుకును ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని ప్రేమను చూపించారు విజయమ్మ. ఇలాంటి నేపథ్యంలో తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయడం అంత సులభం కాదని ట్రిబ్యునల్ లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రిబ్యునల్ లో ఓటమి ఎదురైన తర్వాత ఏ పైకోర్టును ఆశ్రయించాలో.. ఏ పెద్దపెద్ద లాయర్లను నియమించుకోవాలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుంచే ఆలోచించుకోవడం మంచిదని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.
తల్లికి ఇచ్చిన గిఫ్ట్ రద్దు అంత వీజీయేం కాదు!
Saturday, November 23, 2024