‘సరస్వతి’ ముసుగులో జగన్ చవకబారుతనం!

Thursday, October 24, 2024

జగన్మోహన్ రెడ్డి తన కురచబుద్ధులను బయట పెట్టుకున్నారు. చెల్లెళ్లకు అమ్మకు ఇచ్చిన కంపెనీ షేర్లను వెనక్కి తీసుకుంటానని బెదిరించడం ప్రారంభించారు. చెల్లెలికి, తల్లికి ఇద్దరికీ కూడా ఆస్తులలో వాటాలు ఇవ్వాల్సిన తన బాధ్యతను విస్మరించడం మాత్రమే కాకుండా.. ఇచ్చిన వాటాలు వెనక్కు తీసుకుంటానని వేధించడం.. అలా జరగకుండా ఉండాలనుకుంటే రాజకీయంగా తనను విమర్శించకుండా ఉండాలని అడగడం ఆయన చవకబారుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. చెల్లెలు చేస్తున్న రాజకీయ విమర్శలను ఎదుర్కోలేక షేర్లు రద్దు చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎత్తుగడకు పాల్పడడం హేయం గా కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తండ్రి సంపాదించిన ఆస్తులను ఆయన బతికున్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచేశారని, ఆ తర్వాత వచ్చిన ఆస్తులన్నీ తన సొంత శ్రమ- పెట్టుబడితో సంపాదించుకున్నానని వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి చెల్లెలికి లేఖ రాయడం బయటకు వచ్చింది.  కేవలం ప్రేమ ఆప్యాయతతో మాత్రమే కొన్ని ఆస్తులను ఆమె పేరిట బదిలీ చేశానని జగన్ పేర్కొంటున్నారు. చెల్లెలికి విశ్వాసం కల్పించడం కోసం తల్లి పేరిట గిఫ్ట్ డీడ్ కింద కొన్ని షేర్లు రాసినట్లుగా జగన్ చెబుతున్నారు. షేర్లు కాకుండా తాను నేరుగాను, తల్లిద్వారాను గత దశాబ్దంలో చెల్లెలికి రెండు వందల కోట్లు ఇచ్చినట్టుగా కూడా జగన్ చెప్పుకుంటున్నారు.

అయినా చెల్లెలు షర్మిల కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారట! ఆయన శ్రేయస్సు గురించి ఆలోచించలేదట! ఆమె చర్యలు ఆయనను వ్యక్తిగతంగా బాధించాయిట! కనుక ఆమెపై ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయిందట! వాటిని చూపించాల్సిన అవసరం లేదు గనుక షేర్లను ఉపసంహరించుకున్నట్టుగా, రద్దు చేసుకుంటున్నట్లుగా ఆయన లేఖలో పేర్కొనడం విశేషం. షర్మిల యొక్క ఆలోచనలు, ప్రవర్తనలో మార్పులు వస్తే తాను ఆమె పట్ల ప్రేమను ఆప్యాయతను పునరుద్ధరిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం కామెడీగా కనిపిస్తుంది. కేసులన్నీ పరిష్కారం అయ్యాక ఆస్తుల విషయంలో ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తారట! తనకు వైఎస్ అవినాష్ రెడ్డికి, భారతికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుకూడదని, రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉండరాదని జగన్ షర్మిలకు మరొక లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథిగా షర్మిల పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్ ప్రభుత్వ దుర్మార్గపు పోకడలను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమె విమర్శలను తట్టుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి! ఇప్పటికీ జగన్ పాలన వైఫల్యాలు ఏ రకంగా రాష్ట్రాన్ని కుంగదీశాయో షర్మిల బయట పెడుతూనే ఉన్నారు. అయితే ఆమె విమర్శలకు సమాధానం చెప్పే దమ్ము లేక ఆస్తుల విషయంలో ఆమెను బెదిరించి లొంగదీసుకోవాలి అనుకుంటున్నాట్లుగా జగన్ వైఖరి చవకభారుతనంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు షర్మిల కూడా ఘాటైన కౌంటర్ ఇవ్వడం విశేషం!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles