మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత జిల్లాలకు వెళుతున్నారు. ఓడిపోయిన తర్వాత ఎక్కువగా బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో గడపడానికి మాత్రమే తాడేపల్లి నుంచి బయటకు వస్తున్న జగన్ మధ్యలో గుంటూరులో మరణించిన రౌడీషీటర్ కుటుంబాన్ని పరామర్శించడానికి, జైల్లో ఉన్న నందిగం సురేష్ ములాఖత్‌కు తదితర పనుల మీద మాత్రమే బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా ఇంచుమించుగా అలాంటి పనుల మీదనే ఇంటి నుంచి జిల్లాలకు కదులుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. రెండు జిల్లాల పర్యటన తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. అయితే పులివెందులలో అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలి జగనన్నా అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వ కాలంలోని వైఫల్యాల కారణంగా ఇవాళ పులివెందుల మునిసిపాలిటీ కనీసం వీధిలైట్లు కూడా వెలగకుండా అంధకారంలో మునిగిపోయి ఉంది. తన సొంత నియోజకవర్గం సొంత ఊరికి పట్టిన దుస్థితి గురించి ప్రజలు నిలదీస్తారని తెలుసుకుని.. ఏం జవాబు చెప్పాలో ముందే సిద్ధపడి జగన్ వెళితే బాగుంటుందని.. అక్కడి జనం అనుకుంటున్నారు.
గుంటూరులో ఒక రౌడీషీటర్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న యువతిని జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. వైఎస్ఆర్ జిల్లాలో బద్వేల్ లో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని కూడా పరామర్శించాలని షెడ్యూల్ చేశారు. అక్కడినుంచి పులివెందులకి వెళ్లాలని జగన్ టూర్ ప్లాన్! బహుశా ఇడుపులపాయ అతిథి భవనంలో బస చేయవచ్చు. పులివెందుల టౌన్ లోకి వెళ్లి కార్యకర్తలతో సమావేశం అయితే మాత్రం, ఆయన ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే పులివెందుల పట్టణంలో కనీసం వీధిలైట్లు వెలగడం లేదు. మునిసిపాలిటీ విద్యుత్ అధికారులతో చర్చిస్తే జగన్ ప్రభుత్వ పరిపాలన కాలంలో ఏకంగా 27 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం వలన ఇవాళ పులివెందుల పట్టణం అంధకారంలో మునిగిపోయినట్లుగా తెలుస్తున్నదని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరి చెప్పుకొచ్చారు.
జగన్ తన సొంత ఊరిలో ఏం జరుగుతుందో కూడా గమనించలేనంత దుర్మార్గంగా పరిపాలన సాగించారా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందుల వెళ్తే ఆయన ప్రజలకు ఏమి సంజాయిషీ చెప్పుకుంటారు? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. పులివెందుల పట్టణంలోకి వెళ్లకుండా బద్వేలు పరామర్శల తర్వాత నేరుగా ఇడుపులపాయకు వెళ్లి విశ్రాంతి తీసుకుని అక్కడితో సరిపెట్టవచ్చునని కూడా తెలుస్తోంది.