అమరావతికి నిధులు- తిరుగులేని తీపి కబురు!

Tuesday, January 21, 2025

రాజధాని అమరావతికి పునర్నిర్మాణ పనులకు కేంద్రం 15 వేల కోట్ల రూపాయల సహాయం చేయబోతున్నట్లుగా బడ్జెట్ నాడు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మరియు ఎడిబి నుంచి  13,440 కోట్ల రూపాయలు (160 కోట్ల డాలర్లు) రుణం తీసుకుని, మిగిలిన సొమ్మును అదనంగా కేంద్ర ప్రభుత్వం జత చేసి అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందనేది అప్పట్లో ప్రచారం జరిగిన విషయం! అయితే ఈ రుణం తీర్చే బాధ్యత ఎవరిది? అనే విషయంలో రకరకాల సందేహాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రపంచ బ్యాంకుకు తిరిగి చెల్లించవలసింది కేంద్ర ప్రభుత్వమా?  రాష్ట్ర ప్రభుత్వమా? అనే సందేహాలు బలంగా వినిపించాయి. ఇటీవల సిఆర్డిఏ సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణం కోసం  15 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలనే తీర్మానానికి ఆమోదం తెలియజేసినట్లుగా ప్రకటించారు.

దాంతో ప్రజల్లో మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. ఆ 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాల్సి వస్తుందేమో.. మొత్తం దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుగా అమరావతిని చేపడుతున్నప్పుడు ఈ 15 వేల కోట్ల రూపాయలు రుణభారం అదనంగా ప్రభుత్వానికి ఏర్పడదా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా ప్రపంచ బ్యాంకు వెబ్సైట్లో వారు అమరావతి కోసం కేటాయించే నిధుల అంశాన్ని పొందుపరిచారు. ఇందులో చాలా స్పష్టంగా రుణాన్ని భారత కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్లుగా, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. సి ఆర్ డి ఏ అథారిటీని కేవలం పనుల నిర్వహణ ఏజెన్సీగా మాత్రమే అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు వెబ్సైట్లో నమోదు అయింది. దీనిని బట్టి 15 వేల కోట్ల రూపాయలు పూర్తిగా మన రాష్ట్రానికి గ్రాంటు మాత్రమే అనే సంగతి స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి పనులు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ మాత్రమే. దానికి తగ్గట్లుగా ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలను అందిస్తున్నది. 15వేల కోట్లరూపాయలు రుణాన్ని ప్రపంచ బ్యాంకుకు కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని బడ్జెట్ సమావేశాల రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే మంత్రి నారాయణ ప్రకటన, సీఆర్డీయే తీర్మానం అనే ప్రకటనల నేపథ్యంలో గందరగోళం ఏర్పడింది. తాజాగా ప్రపంచబ్యాంకు వెబ్సైట్ ప్రకటన ద్వారా స్పష్టత వచ్చింది.

కేంద్రం ఈ దఫా అమరావతి రాజధానికి అన్ని రకాలుగా చేయూత అందిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం కోర్ కేపిటల్ నిర్మాణానికి ఈ 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే కాదు. అవుటర్ రింగ్ రోడ్డుకు 17వేల కోట్లరూపాయలు కూడా ఖర్చు పెట్టనుంది. రాజధానికోసం వస్తున్న నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందో అనే భయంతో ఉన్న ప్రజలకు.. ఇది పూర్తిగా కేంద్రం గ్రాంటు అనేది ఖచ్చితంగా తీపి కబురే అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles