‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’ అనే మూడు పదాలను నేర్పించి, ఒక ఘనకార్యం సాధించడానికి విలన్ అనుచరులు పడే పాట్లు మనకు అదుర్స్ సినిమాలో కనిపిస్తాయి. బ్రాహ్మణ యువకుడిగా ఉంటూ ఆధునికత ఉట్టిపడే వేషంలోకి మారి తన సహజమైన యాసలో ఈ మూడు పదాలు తప్ప అదనంగా ఒక్క పదం చెప్పాలన్నా లక్షల్లో సొమ్ములు డిమాండ్ చేస్తూ ఉండే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర అదుర్స్ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదుర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను మించిన నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలీసులు విచారణకు పిలిచి.. మీతో పాటు క్లోజ్ గా మెలగుతూ మీతో కలిసి ఫోటో దిగిన వాళ్లను గుర్తుపట్టండి.. అని అడిగితే అచ్చంగా ఇదే సమాధానాలు చెబుతున్నారు. ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబునాయుడు ఇంటి మీద వైసీపీ గూండాలు దాడులకు తెగబడిన కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న నాయకులు విచారణకు అస్సలు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి.
జగన్ ప్రభుత్వ కాలంలో.. వైసీపీ నాయకులంతా విచ్చలవిడిగా చెలరేగిన సంగతి తెలిసిందే. టీడీపీ ఆఫీసు మీద దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో కీలక సూత్రధారులుగా వైసీపీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నందిగం సురేశ్ ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. కాగా.. ఈ నాయకులు పోలీసు విచారణలో ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. దాడి చేస్తున్న వారి ఫోటోలు చూపించి గుర్తుపట్టాలని అంటే.. మేం రాజకీయ నాయకులం.. ప్రతిరోజూ వందల మంది మాతో ఫోటోలు దిగుతారు.. అందరూ మాకు తెలిసి ఉంటారనుకుంటే కుదరదు వంటి సమాధానాలు చెబుతున్నారు.
అదే సమయంలో.. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న చైతన్య అనే లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సోమవారం కోర్టులో లొంగిపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి కేసు భయంతో అజ్ఞాతంలో ఉన్న చైతన్య.. తాజాగా కోర్టులో లొంగిపోవడం ఒక కీలక పరిణామం. ఆయనను విచారించినప్పుడు లేళ్ల అప్పిరెడ్డి గైడెన్స్ గురించి ఏం చెబుతాడనేది ఇప్పుడు కీలకాంశంగా మారింది. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న చైతన్యను లొంగిపొమ్మని ఎవరైనా సలహా ఇచ్చారా? లేదా, నిజాలు చెప్పకుండా తప్పించుకోవడం కష్టం అనే ఉద్దేశంతో ఆయనే లొంగిపోయారా? అనేది తెలియడం లేదు. ఆయన స్వచ్ఛందంగా లొంగిపోయి ఉండి, విచారణలో నిజాలు చెబితే.. ఈ ఆస్కార్ ప్రతిభ ఉన్న అదుర్స్ రేంజి నటులందరికీ దబిడిదిబిడే అని ప్రజలు అనుకుంటున్నారు.
అందరిదీ.. ‘అదుర్స్ ఎన్టీఆర్ రేంజి పర్ఫామెన్సే’!
Saturday, January 18, 2025