విశాఖలో ‘గేమ్ ఛేంజర్’.. సూపర్ హిట్ పక్కా!

Friday, November 22, 2024

విశాఖలో మాత్రమే సూపర్ హిట్ అవుతుందా? మిగిలిన చోట్ల ఏమవుతుందో చెప్పలేమా? అని కంగారు పడకండి! ఇదేమీ రామచరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ కు సంబంధించిన వార్త కాదు. విశాఖ పట్టణానికి ఐటీ రంగంలో దేశంలోనే టాప్ నగరాల జాబితాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆ పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. టీసీఎస్ విశాఖలో పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేస్థాయిలో డెవలప్మెంట్ జోన్ ఏర్పాటు చేయడం అంటూ జరిగితే ఐటీ రంగంలోనే అది గేమ్ చేంజింగ్ పరిణామం అవుతుందని సిబోయాసిస్ అధినేత ఓ.నరేష్ చెబుతున్నారు.

ఒకరి అభిప్రాయం మాత్రమే కాదు. ఐటీ రంగంలో ఈ తాజా పరిణామం మీద చాలా చాలా ఆశలు ఊపిరి పోసుకుంటున్నాయి. టీసీఎస్ వంటి అత్యున్నత స్థాయి సంస్థ అంతపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటుండడంతో ఇంకా అనేక కంపెనీలు అక్కడ తమ తమ బ్రాంచీలు తెరవడానికి మొగ్గు చూపిస్తున్నాయి. అసలే భోగాపురం ఎయిర్ పోర్ట్ వస్తే.. విశాఖ పట్టణానికి అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతందనేది ఐటీ పరిశ్రమ చూస్తున్న మరో ప్లస్ పాయింట్. ఒకసారి టీసీఎస్ కు సంబంధించిన పనులు లేదా కార్యకలాపాలు మొదలైతే గనుక.. అనేక ఇతర పెద్ద సంస్థలు రావడం మాత్రమే కాదు.. పెద్దసంఖ్యలో అంకుర సంస్థలు కూడా విశాఖ వస్తాయని అంతా అంచనా వేస్తున్నారు.

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నిజమైన అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించడం ఎలాగో రుజువవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటూ మాటలతో మోసం చేస్తే.. కూటమి ప్రభుత్వం దానికి విరుద్ధంగా.. అసలు అభివృద్ధిని రుచిచూపిస్తోంది. జగన్ విశాఖనుంచి వెళ్లగొట్టిన లులు మాల్ వంటి సంస్థలు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఐటీ కంపెనీలు కూడా గతంలో వెళ్లిపోయినవి.. ఇప్పుడు మళ్లీ రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

మంత్రి నారాలోకేష్ పనిగట్టుకుని ముంబాయి వెళ్లి టీసీఎస్ పెద్దలను కలిసి విశాఖలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని వివరించిన తర్వాతే.. వారు ఈ జోన్ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఐటీ రంగం విస్తరించడం పరంగా.. నెక్ట్స్ లెవెల్ కు విశాఖ చేరుకుంటుందని ప్రజలు ఆశలు పెంచుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles