పవన్ ను శరణు అనడం తప్ప వేరే గతి లేదు!

Wednesday, November 27, 2024

ఆయనేమో జనసేనాని పవన్ కల్యాణ్ ను వెన్నుపోటు పొడిచి పార్టీనుంచి వెళ్లిపోయిన నాయకుడు. ఇప్పుడు మళ్లీ రోడ్డు మీదకు వచ్చాడు. ఎటు వెళ్లాలో తెలియని, ఇంకా తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. సుస్థిర రాజకీయ భవిష్యత్తు కోరుకునే నాయకుడు అయితే మాత్రం.. ఏమాత్రం సిగ్గుపడకుండా, ఈగోకు పోకుండా.. నేరుగా పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి చేసిన తప్పుకు సారీ చెప్పేసి తిరిగి ఆ పార్టీలో చేరడం ఒక్కటే తరుణోపాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అవస్థలో ఉన్నది మరెవ్వరో కాదు.. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.

రాపాక వరప్రసాద్ తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగబోవడం లేదని తాజాగా ప్రకటించేశారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక, జనసేనకు వెన్నుపోటు పొడిచి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వలన ఆ పార్టీలో చేరానని ఇప్పుడు ప్రకటించిన రాపాక, తన మీద అక్కడ కుట్రలు జరిగాయని అంటున్నారు. కుట్రపూరితంగానే తనకు రాజోలులో ఇటీవలి ఎన్నికల్లో టికెట్ నిరాకరించారని అంటున్నారు. తనను బలవంతంగా ఎంపీగా పోటీచేయించారని కూడా ఆరోపిస్తున్నారు. ఓడిపోతానని తెలిసినా పోటీచేశానంటున్నారు. మొత్తానికి వైసీపీకి, జగన్ కు రాంరాం చెప్పడం అయితే పూర్తయింది. మరి రాపాక భవిష్యత్తు ఏమిటి?

రాపాక వరప్రసాదరావు తెలుగుదేశంలో చేరుతారని బలమైన పుకారు వినిపిస్తోంది. అయితే ఆ పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అక్కడ ఆయనకు నో ఎంట్రీ బోర్డు చూపించేశారు. రాపాక వరప్రసాదరావును పార్టీలో చేర్చుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ తో సున్నం పెట్టుకోవడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగా లేరనేది సమాచారం. పవన్ కల్యాణ్ ను త్యాగం చేసి బంధం కుదుర్చుకునేంత గొప్పవారు రాపాక కాదనే సంగతి అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో రాపాక అటు వైసీపీని కాదనుకుని, ఇటు తెలుగుదేశంలో ఎంట్రీలేక నడిరోడ్డు మీద మిగిలిపోయారు.

విశ్లేషకులు అంచనా వేస్తున్నదాన్ని బట్టి పవన్ కల్యాణ్ వద్దకెళ్లి మన్నింపు కోరి తిరిగి జనసేనలో చేరడం ఒక్కటే ఆయన ఎదుట ఉన్న ప్రత్యామ్నాయం అంటున్నారు. ఎటూ అక్కడ కూడా మళ్లీ  రాజోలు టికెట్ లభిస్తుందనే గ్యారంటీ లేదు. కానీ.. కనీసం రాజకీయం ఏదో ఒక భవిష్యత్తు ఉంటుంది. కూటమిలో చాలా శక్తిమంతమైన నాయకుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ను  కాదని ఆయనను తెలుగుదేశం, బిజెపి కూడా చేర్చుకోవని విశ్లేషిస్తున్నారు. మరి రాపాక ఏం చేస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles