పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తననెవరూ చూడడం లేదని అనుకుంటుందట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను గమనిస్తే ఆ సామెతే గుర్తుకు వస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో, పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయో.. ప్రజలు వివిధ పార్టీల పట్ల ఎలా స్పందిస్తున్నారో చూడడానికి మనసొప్పకుండా జగనన్న కళ్లు మూసుకుని జీవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సమకాలీన పరిణామాలను చూడకుండానే.. తనంత తాను తోచిన వ్యాఖ్యలు చేసుకుంటూ బతికేస్తున్నారని కూడా అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారని, అందువల్ల ఆ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనిస్తే.. ఆయన అవగాహనలోపానికి నిదర్శనం అనిపిస్తోంది.
బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో గడుపుతూ.. మధ్యమధ్యలో ఖాళీ ఉన్నప్పుడు తాడేపల్లికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం రోజూ ఏదో ఒక సమావేశం పెట్టుకుంటున్నారు. తమాషా ఏంటంటే.. ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యర్థి పార్టీ మీద నిందలు వేస్తూ, తమ సొంత డబ్బా కొట్టుకుంటూ పార్టీలు ఎలా గడుపుతాయో.. జగన్ ఆ తీరు నుంచి ఇంకా బయటకు రాలేదు. ఓటమి గురించి తొలి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలనే ఇప్పటికీ చెప్పుకుంటూ బతికేస్తున్నారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడని అంటున్నారు. చంద్రబాబు అబద్ధాలతో పోటీపడి ఉంటే తాను ఈ పాటికి ముఖ్యమంత్రి స్థానంలోనే ఉండేవాడినేమో అని అంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక వెరైటీ విశ్లేషణను పంచుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి తాను 2019 ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అన్నింటినీ నెరవేర్చారు గనుక.. ఆయన పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు మొహం చెల్లేదట. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండేదట. కానీ.. అబద్ధపు హామీలు ఇచ్చిన కారణంగా.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప.. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరికీ ప్రజల్లోకి వెళ్లేందుకు మొహం చెల్లడం లేదట.. ఇదీ జగనన్న విశ్లేషణ.
జగన్ కళ్లు మూసుకుని, ప్రపంచంలో ఏం జరుగుతన్నదో చూడకుండా ఈ మాటలు అంటున్నారేమో అనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న తీరుచూసి ప్రజలు నీరాజనం పడుతున్నారు. కేవలం కొన్ని రోజుల కిందటి వరకు .. పరిపాలనకు వందరోజులు పూర్తయిన సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఎన్డీయే కూటమి పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి, ఈ ప్రభుత్వం ఏయే మంచి పనులు చేస్తున్నదో వివరించి చెప్పారు. ప్రతిచోటా ప్రజలనుంచి వారికి మంచి స్పందన లభించింది. గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ అనే పేరుతో జగన్ ఒక డ్రామా నడిపించినప్పుడు.. ఎన్నిచోట్ల ప్రజలు ప్రతిఘటించారో లెక్కలేదు. ఇవన్నీ గమనించకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా జగన్ తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
పిల్లి పాలు తాగినట్టుగా జగనన్న మాటలు!
Wednesday, December 18, 2024