ఎన్నికల తర్వాత.. ఘోరమైన పరాజయం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బాగా బలహీనపడుతూ వస్తోంది. అన్ని స్థాయుల్లోనూ నాయకులు అధికార కూటమి పార్టీల్లోకి వలస వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిపోతున్న వారిని అవకాశవాదులు అని వైసీపీ నేతలు సహజంగానే నిందిస్తున్నారు. కానీ.. ఆ నిందలను పరిహసించేలా.. కొందరు సీనియర్ నాయకులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి.. అసలు ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయ జీవితం ఇక్కడికి చాలు అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంతో వీరంతా విసిగిపోయిన వారే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో నేతలు వలస వెళుతున్న కొద్దీ.. పార్టీ బలహీనపడుతోందనే చులకన భావం ప్రజల్లో కూడా కలుగుతోంది.
అయితే నేతలు వెళ్లిపోతున్నప్పుడు వారిని బుజ్జగించడం.. వెళ్లిపోయిన తర్వాతనైనా సరే వారికి సర్దిచెప్పి తిరిగి పార్టీలోకి తీసుకురావడం గురించి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఎంతగా అంటే.. కనీసం పార్టీని గుత్తకు తీసుకున్నట్టుగా గతంలోనూ అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చూపించిన పాటి శ్రద్ధ కూడా జగన్ చూపించడం లేదని పార్టీ సీనియర్లే అంటున్నారు.
పార్టీ ఓటమి తర్వాత.. అనేక ప్రాంతాల్లో స్థానిక సంస్థలు, మునిసిపాలిటీల ప్రతినిధుల తరహాలోనే పుంగనూరు మునిసిపల్ ఛైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు కొందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ నుంచి ఎవరు బయటకు వెళ్లినా సరే.. మాజీ సీఎం జగన్ అసలు పట్టించుకోవడం లేదు. కానీ మిధున్ రెడ్డి ఆయన ధోరణిలో విడిచి పెట్టలేదు. పార్టీ వీడి వెళ్లిపోయిన పుంగనూరు వారందరితోనూ మాట్లాడారు. సొంత పార్టీలోనే ఉండేలా బుజ్జగించారో, ప్రలోభపెట్టారో, బెదిరించారో.. జగన్ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా స్థానికంగా మాత్రం తమ కుటుంబ పెత్తనమే ఎప్పటికీ నడుస్తుంటుందని వారికి సంకేతాలు ఇచ్చారో తెలియదు. మొత్తానికి వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చారు. కొన్ని పరిస్థితుల వల్ల తెదేపాలో చేరాం అని, ఇకపై వైసీపీలోనే కొనసాగుతాం అని వారు ప్రకటించారు.
మిధున్ రెడ్డి కౌన్సిలర్ల మీద చూపించిన శ్రద్ద, జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీద చూపించలేరా? వెళ్లిపోతున్న వారితో మాట్లాడి బుజ్జగించి పార్టీ వీడకుండా చేయలేరా? అని శ్రేణులు విస్తుపోతున్నారు. ఆయన అసలు పార్టీని పట్టించుకోవడం మానేశారని వ్యాఖ్యానిస్తున్నారు.