జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో విసిగిపోతునన నాయకులు పదవులను కూడా త్యజించి ఆ పార్టీని వీడిపోవడానికి సిద్ధం అవుతూనే ఉన్నారు. ఒకరిద్దరు రాజీనామాలు సమర్పించేలోగా.. మరో ఇద్దరు ముగ్గురు నాయకుల పేర్లు రాజీనామాలకు సిద్ధం అంటూ వినిపిస్తూ ఉన్నాయి. ఈ వలసలకు అడ్డుకట్ట వేయడానికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేస్తున్న ప్రయత్నం ఏమీ లేకపోవడం గమనార్హం. అయితే.. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు సీనియర్, వివాదరహిత నాయకుల చేతిలో వలసలను ఆపడానికి ప్రయత్నించే బాధ్యత పెట్టినట్టుగా తెలుస్తోంది.
ప్రధానంగా.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నాయకుల్లో ఒకరు, పార్టీకి ఆర్థికంగా కూడా అండదండగా ఉండే వ్యక్తి అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, అలాగే సీనియర్ నాయకుడు, వైఎస్సార్ కు కూడా సన్నిహితుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ లను బుజ్జగింపులకోసం వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నాయకులు కూడా పార్టీ ఫిరాయిస్తున్నట్టు పుకార్లు రావడంతో.. వారిద్దరూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. తుదిశ్వాస వరకు వైసీపీలోనే, జగన్ వెన్నంటే ఉంటాం అని స్పష్టీకరించారు. అయితే పార్టీ వీడే ఆలోచనలో ఉన్న ఇతర ఎంపీలు రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు తదితరులను బుజ్జగించే బాధ్యత వీరికే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇంతదాకా వచ్చినా జగన్ పట్టించుకోకపోవడం ఒక చిత్రమైన పరిణామం. అయితే.. రాజీనామాలు చేయకుండా ఆపడానికి వీరు బుజ్జగింపులు చేపడుతున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదని అంటున్నారు.
అంతకంటె కీలకమైన విషయం ఏంటంటే.. గత అయిదేళ్ల ప్రభుత్వ కాలంలో అధికారం చెలాయిస్తూ ఉండిన ఇతర నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారిని బుజ్జగింపులకు కనీసం ప్రయత్నించకుండా మౌనంగా ఉండాలని జగన్ పురమాయించినట్టు తెలుస్తోంది. అలకపూని వెళుతున్న నాయకులు ప్రధానంగా వారి గత వైఖరి మీద కూడా విరుచుకుపడుతున్నారు. అందుకే బుజ్జగింపుల్లో వారిని పక్కన పెట్టి.. వివాద రహితులైన ఈ ఇద్దరు నాయకుల్ని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. అయినా సరే.. వలసలు ఆపడం కష్టం అని.. పార్టీ వీడి వెళ్లడానికి నిశ్చయించుకున్నాక ఇక ఏం చెప్పినా ప్రయోజనం లేదని పలువురు పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారు.
వలసలను ఆపే బాధ్యత ఆ ఇద్దరికే!
Friday, November 22, 2024