ఓన్లీ ఆఫర్ : అవే పదవులు మళ్లీ ఇస్తాం!

Thursday, September 19, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పార్టీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు గాక.. జగన్ వెన్నంటి ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే భయం కూడా ఉండవచ్చు గాక.. కానీ.. అంతమాత్రాన ఇంకా ఎంతో కాలం పదవి అనుభవించే అవకాశం ఉండగా.. వాటిని వదులుకుని మరీ.. వైసీపీ నాయకులు ఎందుకు రాజీనామా చేస్తున్నట్టు? అందరికీ ఇది మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోతోంది. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏ పదవులకైతే రాజీనామా చేస్తున్నారో.. తమ పార్టీలో చేరిన తర్వాత మళ్లీ అదే పదవులు ఇస్తాం అని తెలుగుదేశం హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైసీపీ ని వీడిపోవడానికి నాయకులు క్యూ కడుతున్నారు. మిగిలిన పదవీకాలం తెలుగుదేశం ద్వారానే పొందితే.. ఆలోగా పార్టీతో టర్మ్స్ బాగుంటే తర్వాత కూడా రాజకీయ జీవితం బాగానే ఉంటుందని, లేకపోయినా నష్టమేమీ లేదని నాయకులు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి శాసనమండలిలో మాత్రం మైనారిటీలోనే ఉంది. అక్కడ వైసీపీకి ఆధిక్యం ఉంది. ముందు మండలిలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టడం అనేది కూటమి పార్టీలు, తెలుగుదేశం టార్గెట్ గా కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్సీల్లో చాలా మందికి, రాజీనామా చేసి వచ్చి తమ పార్టీలో చేరితే మళ్లీ అదే పదవి ఇస్తాం అనే ఆఫర్ ఇస్తున్నారని సమాచారం.

పోతుల సునీత రాజీనామా ఈ ఆఫర్ ప్రభావంతోనే జరిగింది. వైసీపీని వీడిపోవడం తప్ప ఈ ఆఫర్ వలన ఆ నాయకులు కోల్పోయేది ఏమీ లేకపోవడంతో పలువురు ముందుకు వస్తున్నట్టు సమాచారం. శుక్రవారం నాడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసి మండలి ఛైర్మన్ కు పంపారు. వీరిద్దరికీ ఇంకా పదవి చాలాకాలం ఉంది. కర్రి పద్మశ్రీ గవర్నరు కోటాలో నియమితులైన ఎమ్మెల్సీ కాగా, బల్లి కల్యాణ్ చక్రవర్తి ని ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపారు. నిజానికి ఆయన తండ్రి బల్లి దుర్గాప్రసాద్ ఒకప్పట్లో చంద్రబాబుకు సన్నిహితులు. కానీ తర్వాతి పరిణామాల్లో వైసీపీ తరఫున ఎంపీ అయ్యారు. కరోనాతో మృతిచెందారు. ఆ ఖాళీలో వచ్చిన ఉప ఎన్నికలో జగన్, తన సహాయకుడు గురుమూర్తిని పోటీచేయించి గెలిపించారు. కల్యాణ్ చక్రవర్తికి కంటితుడుపుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గవర్నరు కోటా, ఎమ్మెల్యేలా కోటాలో ఉప ఎన్నిక వచ్చినా కూడా తిరిగి వారిని గెలిపించడం తెలుగుదేశానికి సునాయాసమైన విషయం గనుక.. అదే పదవి మళ్లీ ఇస్తాం అనే ఆఫర్ తో వారితో రాజీనామాలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles