కేంద్రానికి నో చెప్పే ధైర్యం జగన్ కు ఇంకా రాలేదు..!

Thursday, September 19, 2024
ఇప్పుడు ఆయన అధికారంలో లేరు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు పథకాలు రాబట్టడానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో సంబంధాలు కొనసాగిస్తున్నానని ప్రజల ఎదుట బుకాయించడానికి అవకాశం లేదు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సరే సభలలో వారికి ఓట్ల బలం అవసరమైనప్పుడు తాను సంసిద్ధంగా ఉంటానంటూ వారికి జై కొట్టే అలవాటును మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా మానుకున్నట్లుగా లేదు. ఇంకో కోణంలో చెప్పాలంటే కేంద్ర నిర్ణయాలకు నో చెప్పే ధైర్యం ఆయనలో ఇంకా చిక్కబడినట్లుగా లేదు.
వక్ఫ్ బిల్లు విషయంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చాలా మేలు చేసింది.. ప్రతి అంశంలోనూ వారికి అండగా నిలిచింది.. లాంటి మాటలు వారికి వినిపించారు. వక్ఫ్ బిల్లు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నదని, ఈ బిల్లు వల్ల భూములు తమకు దక్కకుండా పోయే ప్రమాదం ఉన్నదని మైనారిటీ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ జగన్ మాత్రం వక్ఫ్ బిల్లు విషయంలో తమ పార్టీ నిర్దిష్టంగా ఫలానా వైఖరి అవలంబిస్తుంది.. అనే హామీ వారికి ఇవ్వలేదు. ముస్లింలు వచ్చి మొరపెట్టుకున్నా కూడా ‘ఈ బిల్లును వైసీపీ పార్లమెంట్లో వ్యతిరేకిస్తుంది’ అనే మాట జగన్ నోటి నుంచి రాలేదు. ఈ బిల్లు గురించి మైనారిటీలు ప్రస్తావిస్తున్న అంశాలను మా ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు.. సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ముస్లింల అభ్యంతరాలను చట్టసభ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు.. లాంటి పడికట్టు మాటలతో మభ్యపెట్టడానికి ప్రయత్నించారు తప్ప..  వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ వైఖరి ఇది అని జగన్ చెప్పనేలేదు.
నిజానికి ఒక బిల్లు రాజ్యసభలో నెగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న బలం కూడా కేంద్రానికి అవసరం. జగన్ మాటలను గమనిస్తూ ఉంటే కేంద్రం అడిగినప్పుడు ఈ బిల్లుకు మేం మద్దతు ఇవ్వం అని చెప్పగల ధైర్యం ఆయనలో ఇంకా ఏర్పడినట్లుగా కనిపించడం లేదు. కేసుల భయంతోనే కేంద్రం ఎదుట జగన్మోహన్ రెడ్డి తొలినుంచి సాగిలపడుతున్నారని విమర్శలు ఈ సందర్భంగా మరోసారి తెరమీదికి వస్తున్నాయి. బిల్లు సభలో ఓటింగుకు వచ్చేలోగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. మైనారిటీ వర్గాల పట్ల తన నిబద్ధతను ఏ రకంగా నిరూపించుకుంటారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles