ఎన్నికలలో ఓడిపోయిన ప్రతి ఒక్కరూ- సదరు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించడం అనేది ఇటీవలి కాలంలో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అదే పని చేస్తున్నారు. లక్షలాదిమంది అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది.. తన పథకాల ద్వారా లబ్ధి పొందిన లక్షలాదిమంది అక్క చెల్లెళ్ల ప్రేమ ఏమై పోయింది.. అంటూ ఆయన రాగాలు తీస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ కు మామయ్య, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దాని మీద విచారణ కూడా జరగబోతుంది.
ఇటీవల ఎన్నికలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా దారుణంగా పరాజయం పాలయ్యారు. ఓటమి గురించి ముందే భయం ఉండడంతో.. బాలినేని ఎంపీ టికెట్ను మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి తీరాలని, లేకపోతే జిల్లాలో విజయావకాశాలు దెబ్బ తింటా యని జగన్ మోహన్ రెడ్డి వద్ద నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎవరి మాట వినే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి మామయ్య మాటలను కూడా బుట్టదాఖలు చేశారు. తీరా జగన్ మీద ఉన్న అపరిమితమైన వ్యతిరేకత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఫలితాలు ఎంత ఏకపక్షంగా ఉన్నప్పటికీ ‘తన నియోజకవర్గంలో ఈవీఎంలలో అక్రమాలు జరగడం వల్ల మాత్రమే తాను ఓడిపోయాను’ అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి సాహసించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీకి చెందిన ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారి ముందు వాటిని పరిశీలిస్తారు. ఒంగోలు నియోజక వర్గం పరిధిలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎం లను బాలినేని ఫిర్యాదు మేరకు పరిశీలించనున్నారు. ఈ డమ్మీ బ్యాలెట్ లో పోలింగ్ ప్రక్రియలో ఓటు చేసిన ప్రకారం ఓటు నమోదు అయితే గనుక బాలినేని ఫిర్యాదు తప్పు అని తేలినట్లే. ఒకవేళ వేసిన ఓటు ఒకరకంగా.. రికార్డు అయిన ఓటు మరొక రకంగా ఉంటే అప్పుడు తదనగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది.
సాధారణంగా మనదేశంలో ఈవీఎంల ద్వారా పోలింగ్ ప్రక్రియ చాలా లోపరహితమైనది. ఈ పరిశీలన ప్రక్రియలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఫిర్యాదు తప్పు అని తేలితే ఆయన లెంపలు వేసుకుంటారా? చంద్రబాబు విజయం మీద చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలన్నీ అసత్యాలని, ప్రజలలో వ్యతిరేకత కారణంగానే తాము ఓడిపోయామని ఒప్పుకుంటారా? అనేది ఇప్పుడు రాజకీయాల వర్గాలలో చర్చనీయాంశంగా ఉంది.
తప్పని తేలితే బాలినేని లెంపలు వేసుకుంటారా?
Monday, November 25, 2024