తాను వెళుతున్నది పరామర్శ కోసం అని.. అలాంటి పర్యటనల్లో ఓవరాక్షన్ చేయకుండా ఉండాలనే స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అధికారంలో ఉన్న రోజుల్లో పాయింట్ టూ పాయింట్ హెలికాప్టర్లలో మాత్రమే తిరుగుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద యాత్రలు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ఆయన ఇంట్లోంచి కదులుతున్నారంటే చాలు.. గమ్యస్థానం చేరేవరకు దారిపొడవునా ఉండే పార్టీ నాయకులకు ముందే పురమాయింపులు, ఆదేశాలు వెళ్లిపోయి ఉంటాయి. జగనన్న రావడానికి ముందునుంచి వారు తమ గ్రామాల్లోని జనాల్ని పోగేసుకుని రోడ్డు మీదకు వచ్చి వేచిఉంటారు. జగనన్న జనాన్ని చూడగానే.. తనకోసం వెల్లువలా వచ్చారని మురిసిపోయి కారు దిగి వారికి అభివాదం చేసి.. మళ్లీ ముందుకు కదులుతారు. జగన్ లో ఉండే ఇలాంటి పబ్లిసిటీ పిచ్చి నంద్యాల జిల్లా సీతారామపురం పరామర్శ యాత్ర సందర్భంలో పరాకాష్టకు చేరుకుంది.
హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లారు. సహజంగానే నష్టపోయిన కుటుంబానికి ఎలాంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండానే, భరోసా ఇవ్వకుండానే, చంద్రబాబు సర్కారును నిందించడంతోను, లోకేష్ రెడ్ బుక్ ను ఆడిపోసుకోవడంతోను ముగించారు. అయితే ఈ టూరు సందర్భంగా ఆయన జనాదరణ హైడ్రామా నడిచింది.
జనం ఆయన కారు మీదికి ఎగబడ్డారు. ఒకరు కారు మీద పడుకుని జగన్ ను పలకరించే ప్రయత్నం చేశారు. మరో అభిమాని ఆయన కారు మీదికి షేక్ హాండ్ కోసం ఎగబడ్డారు. ఇలాంటి మనుషుల్ని జగన్ అనుచరులే పురమాయించేరేమో తెలియదు. కానీ ఈ అవకాశాన్ని జగన్ తన కేసుకోసం వాడుకుంటున్నారు.
ఒకవైపు తనకు సీఎం రేంజి సెక్యూరిటీ ఏర్పాట్లు కావాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ నడుపుతున్న సమయంలోనే.. ఆయన సొంత పార్టీ తమ్ముళ్లు అధినేత వాహనం మీదికి ఎగబడడం అనేది చిత్రంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా వాహనం మీదికి వచ్చింది పార్టీ కార్యకర్తలే అయినప్పటికీ.. వాటిని చూపి.. జగన్ కు భద్రత కరవైపోయినదని సాక్షి పత్రిక గగ్గోలు పెట్టడం గమనిస్తే.. ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందా అనిపిస్తోంది.
తనకు భద్రత పెంచాలని అడగడం వరకు ఒక ఎత్తుగానీ.. తనకు సీఎంగా ఉన్నప్పటి భద్రత కావాలని జగన్ అడగడం, దానికి మద్దతుగా ఇలాంటి డ్రామాలను నడిపించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
నంద్యాల టూర్లో జగన్ భద్రత డ్రామా!
Friday, December 5, 2025
