బొత్స సత్యనారాయణ చీపురుపల్లి లో తాను ఓటమి చెందుతానని ఊహించి ఉండరు. కానీ ఈ రాష్ట్రానికి జగన్ పరిపాలన వద్దని చాలా గట్టిగా నిర్ణయించుకున్న జనం.. బొత్స లాంటి కొమ్ములు తిరిగిన నాయకుడిని కూడా ఓడించారు. ఆ క్లారిటీ బొత్సకు కూడా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ గా మండలిలో అడుగు పెట్టే ఛాన్స్ ఇచ్చారు జగన్. తన పేరు ప్రకటించినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారో తెలియదు గానీ క్రమక్రమంగా ఎమ్మెల్సీ బరిలో నిలవడానికి ఆయన విముఖంగా మారుతున్నట్టు తెలుస్తోంది.
జగన్ తమకు ఉన్న ఓటర్ల బలం ఆధారంగానే గెలవదలచుకుంటే గనుక సత్యనారాయణ పేరును ప్రకటించే వారే కాదని పార్టీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ధనబలం ద్వారా తప్ప ఈ ఎన్నిక నెగ్గే ఛాన్స్ లేదని తెలియడం వల్లనే జగన్, బొత్సను ఎంచుకున్నారు. ఈ సంగతి బొత్సకు కూడా తెలుసు. కానీ నెమ్మదిగా ఆయనకు గెలుపు మీద అనుమానం పుడుతోంది! ప్రజాప్రతినిధులు జారుకుంటుండగా ఆయనలో విముఖత ఏర్పడుతున్నట్టు సమాచారం.
గెలిచినా సాధించేది ఏమీ లేదని బొత్స ఆలోచిస్తున్నారట. గెలవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. తీరా గెలిచినా బావుకునేది లేదు. పైగా గత అయిదేళ్ల అవినీతి కేసులు తెరపైకి వస్తే ఎటో ఇబ్బందులు తప్పవని ఆలోచిస్తున్నారట.
గట్టిగా గెలవాలనే పట్టుదలతో పోటీ చేస్తేనే.. దక్కేది అంతమాత్రం! అలాంటప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా పోటీ చేస్తే గెలుస్తారా అని పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.