తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం చంద్రబాబు అనుసరిస్తున్న మంచి పద్ధతులలో ఒకటి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఐదేళ్లలో ప్రజలు ఎన్నడూ చూడని అనుభవాలను చంద్రబాబు పాలన వారికి రుచి చూపిస్తోంది.
అయితే ప్రజలకు- పార్టీకి కూడా న్యాయం జరగాలి అంటే నిత్యం అందరితో మమేకం అవుతూ ఉండడం కేవలం పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను చేయాల్సిన పని మాత్రమే కాదని, తన జట్టులోని ప్రతి ఒక్కరూ అదే బాధ్యతలు పంచుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు రోజుకు ఒకరు వంతున అందుబాటులో ఉండాలంటూ షిఫ్ట్ డ్యూటీలు వేశారు. శని ఆదివారాలు మినహా మిగిలిన పని దినాలలో మంత్రులు అందుబాటులో ఉంటారు.
సామాన్యులు పార్టీ కార్యకర్తలు అధినాయకులను కలిసి తమ కష్టాలు చెప్పుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. గత ఐదేళ్లలో అలాంటి ఏర్పాటు లేదు. జగన్మోహన్ రెడ్డి ని సామాన్యులు కలవడం అంటే కుందేటి కొమ్ము సాధించినట్లు గా ఉండేది. ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించినా కూడా పరదాలు కట్టేసి ప్రజలను కనీసం ఆయనను చూడడానికి కూడా అనుమతించేవారు కాదు. జగన్ ఎన్నికలవేళ ప్రజల దగ్గరకు వచ్చారు తప్ప అధికారంలో ఉండగా వారి మొరలు ఆలకించిన సందర్భమే లేదు.
తీరా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలోని అహంకారపూరిత వైఖరి అలాగే ఉంది. ఈనెల 15వ తేదీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాను అని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి అదే రోజున బెంగళూరు ప్యాలెస్ కు పారిపోయారు. అధికారంలో ఉన్న తొలి రోజుల నుంచి స్పందన, ప్రజాదర్బార్ రకరకాల పేర్లతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలుస్తాను అని అనడమే తప్ప జగన్ ఆ పని చేసింది లేదు.
చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి జగన్ కు పూర్తి భిన్నంగా.. ప్రజల ఆదరణ చూరగొనేలా ఉంది. సీఎం అయ్యాక పలురకాలుగా పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అదే బాధ్యతను మంత్రులకు కూడా పంచుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా షెడ్యూలు చేశారు. వారితో పాటు ఒక పార్టీ సీనియర్ నాయకుడు కూడా అందుబాటులో ఉంటారు. ఈ ఏర్పాటు ప్రభుత్వానికి- ప్రజలకు- పార్టీకి మధ్య అనుసంధానంగా ఉపయోగపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.