అమరావతి రాజధానిని జగన్ కేవలం తన కుట్రబుద్ధుల కారణంగా ఒక శ్మశానంలాగా మార్చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పర్యటన చేసిన సమయంలో.. 70-80 శాతం పూర్తయిన ఐఏఎస్ ల భవనాలు, న్యాయమూర్తుల క్వార్టర్లు మొత్తం కర్రతుమ్మ అడవుల్లో ఉండడం చూసి ప్రజలు దుఃఖించారు. ఐకానిక్ బిల్దింగులుగా నిర్మించాలనే ఉద్దేశంతో సెక్రటేరియేట్ కు , హైకోర్టుకు పునాదులు వేస్తే.. అవి నీటిమడుగుల్లో అయిదేళ్లుగా నానుతూ ఉండడాన్ని చూసి ఆవేశపడ్డారు. ఈ రకంగా అమరావతిని మొత్తం శ్మశానంలాగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలో తన ఇంటిచుట్టూ పరిసరాలను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను మాత్రం నందనవనంలాగా తయారుచేయించుకున్నారు. ఈ పోకడ చూసి.. జగన్ తన ప్రతిభతో ఒక శ్మశానాన్ని సృష్టించి.. దాని మధ్యలో ఉన్న తన నివాసం చుట్టూ మాత్రం పూలతోట పెంచుకున్నారనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
అమరావతి మీద జగన్ కక్ష కట్టారనేది పసిపిల్లవాడిని అడిగినా చెబుతారు. తాను పూర్తిచేసినా సరే.. అమరావతి రాజధాని అనే కీర్తి మాత్రం చంద్రబాబు ఖాతాలోకి వెళుతుందనేది జగన్ కు అసూయ. అందుకే నగరాన్ని శ్మశానం చేసేశారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టడానికి తాడేపల్లి ఆయన సౌధం నిర్మించుకున్నారు. చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు.. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా.. ఇదే రాజధాని.. ఇక్కడే ఉంటా.. అని మాయమాటలతో ప్రజలను నమ్మించి.. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత.. శ్మశానంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఆయన తన తాడేపల్లి నివాసం చుట్టూ మాత్రం చాలా అద్భుతంగా పూలతోటలాగా గార్డెన్ లాగా చేయించుకున్నారు. తమాషా ఏంటంటే.. తన ఇంటిచుట్టూ ఉన్న రోడ్డు మీద కిలోమీటరు పొడవునా నందనవనంలాగా ఆయన తయారుచేయించుకున్నప్పటికీ.. అయిదేళ్లపాటు ఆ వైభోగం కూడా బాహ్యప్రపంచానికి తెలియదు. తన ఇల్లు ఒక నిషిద్ధ ప్రాంతం అన్నట్టుగా దానికి అన్నివైపులా ఉన్న రోడ్లలో నరమానవులకు ఎంట్రీ లేకుండా పోలీసులు అవుట్ పోస్టులు , చెక్ పోస్టులు పెట్టించుకున్న కారణంగా.. ఈ నందనవనాన్ని ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు. తన ఇంటివద్ద మాత్రం అమరావతికి అంత వైభవంగా ఖర్చు పెట్టి ఉద్యానవనాలను ఎందుకు సృష్టించుకున్నారో ఆయనకే తెలియాలి.
తాను ఏ ఊర్లో అడుగుపెట్టినా సరే.. అక్కడి చెట్లన్నింటినీ నరికేస్తూ చెలరేగి పాలన సాగించిన జగన్.. కనీసం తన ఇంటి వద్ద రోడ్లులోనైనా చెట్లను పెంచేలా చేశారని జనం నవ్వుకుంటున్నారు.
జగన్ సృష్టి శ్మశానంలో ఉన్నది ఒక పూలతోట!
Thursday, November 21, 2024