ఒక్క ఛాన్స్ అని బతిమాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలాం అరాచక అవినీతిమయమైన పాలన అందించారో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన అనుచరులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకున్న ప్రతి నాయకుడు గానీ తమ తమ స్థాయిలో విచ్చలవిడిగా రాష్ట్ర సంపదను దోచుకోవటం ఒక్కటే లక్ష్యంగా చెలరేగిపోయారు. ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి పేరుతో నిధులు బ్యాంక్ అకౌంట్లకు వేస్తూ.. తమ అరాచకాల మీద దృష్టి సారించుకుండా వారి కన్నుగప్పవచ్చునని అనుకున్నారు. కానీ వారి పాచిక పారలేదు. ప్రజలు దారుణంగా ఓడించి అందరినీ ఇంట్లో కూర్చోబెట్టారు.
జగన్ పరిపాలన సాగుతున్న రోజుల్లో కూడా ప్రతిపక్షాల నాయకులు వారి అవినీతి దందాల గురించి అనేక ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ కూడా శాంపిల్ మాత్రమే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వ్యవహారాలను తవ్వితీస్తుంటే పెద్దపెద్ద అనకొండలు బయటపడుతున్నాయి. జగన్ పాలన సాగిన రోజుల్లోనూ, ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్షల వారు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ జగన్ దోపిడీని పోల్చి చెప్పడానికి ఏపీలోని ఆయన వ్యతిరేక పార్టీల వారికెవ్వరికీ రాని పోలిక తెలంగాణ బిజెపి నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కు వచ్చింది.
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని గత వైకాపా పాలకులు వీరప్పన్ వారసులు అంటూ అభివర్ణించారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆస్తులకు కూడా పంగనామాలు పెట్టి దోచుకున్న నయవంచుకులు అధికారం దిగిపోయారంటూ హర్షం వ్యక్తం చేశారు.
నిజానికి వైసీపీలోని పలువురు నాయకులు ఎర్రచందనం అక్రమరవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలుసు. మొత్తం ఆ పార్టీ దళాలు అందరినీ వీరప్పన్ వారసులుగా బండి సంజయ్ అభివర్ణించడం గొప్ప పోలికగా కనిపిస్తోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల స్వామివారి ఆస్తుల పరిరక్షణకు కొత్త ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా బండి సూచించారు.
బలే బలే.. వాళ్లు వీరప్పన్ వారసులంట!
Thursday, November 21, 2024