,ఆదర్శాలను నైతిక విలువలను పాటించేవారు చెబితే చాలా బాగుంటుంది. అలాకాకుండా తప్పు చేసే అవకాశం లేనప్పుడు, తమకు చేత కానప్పుడు ఆదర్శాల ముసుగు వేసుకొని, నైతికత గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలోకి ఎవరైనా రావాలనుకుంటే కనుక ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని చాలా గొప్ప ఆదర్శాన్ని ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఈడి, సిబిఐ కేసులు ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశం కూడా లేదంటున్నారు.
ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు- కాంగ్రెస్ లో చేరినట్లుగా- రాజీనామా చేయకుండా భాజపాలోకి వచ్చే అవకాశం లేదు అని బండి సంజయ్ చెబుతున్నారు. కే కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ ఆ పార్టీలో చేరిన ఇతర ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. రాజీనామాలు చేయిస్తే గనుక.. జరగబోయే మొత్తం ఉపఎన్నికల్లో బిజెపినే గెలిచి తీరుతుందిట. ఆ జోస్యం కూడా ఆయన చెబుతున్నారు.
బండి సంజయ్ ప్రవచిస్తున్న నైతిక విలువలు ఆదర్శాలు ఇవన్నీ కూడా కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయా? యావద్దేశానికి వర్తిస్తాయా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో రాజీనామా చేయించకుండానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమతో కలిపేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూల్చేసి, తమ కాషాయ జెండా ఎగరేయడానికి అత్యుత్సాహం చూపిస్తూ ఉంటుంది. ఈడి, సిబిఐ దాడులు ఒకసారి జరగగానే కొందరు నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకొని రక్షణ కవచంగా ఆ పార్టీని మార్చుకుంటున్నారు.
తెలంగాణకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక భారత రాష్ట్ర సమితిని వీడదలుచుకున్న ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపే వెళతున్నారు. కేంద్రంలో ఏలుతున్న బిజెపి వారికి ఫస్ట్ ప్రయారిటీగా కనిపించకపోవచ్చు. పైగా బిజెపిలో ఇప్పటికే రాష్ట్రంలో బోలెడు ముఠాలున్నాయి. అందుకే బీజేపీని ఆశ్రయించడం లేదేమో. పరిస్థితి ఇది కాగా, తమ వైపు వచ్చే వాళ్ళు లేనందువలన రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో చేర్చుకోం అంటూ బిజెపి నీతులు చెబుతోంది. ఈ సూత్రాన్ని ఇతరత్రా దేశమంతటా అమలు చేసి చూపిస్తే ఆ తరువాత నమ్మగలం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
వారివి వృద్ధనారీ ప్రతివ్రత డైలాగులు!
Thursday, November 21, 2024