తనపై కిడ్నాపర్, రౌడీ ఇజం, బ్లాక్ మెయిలర్ అంటూ అనేక ఆరోపణలు చేశారని.. కానీ కార్యకర్తలకు ఆళ్లగడ్డ ప్రజలకు వాస్తవాలు తెలుసని ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు. అందుకే తనను అక్కడి ప్రజలు గెలిపించుకున్నారని ఆమె అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను వెల్లడించారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయాక.. ఆయన అనుచరులు ఎవరూ కూడా మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లలేదు.
కేవలం ఏవీ సుబ్బారెడ్డి ఒక్కడే కావాలని తనకు దూరం అయ్యాడన్నారు. ఆళ్లగడ్డలో గొడవలు జరగకూడదన్నదే మేము ముందు నుంచి పెట్టుకున్న లక్ష్యమన్నారు. ఈ విషయమై చంద్రబాబుతో కూడా చర్చించామని అఖిల తెలిపారు. పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీకి పదవులు ఇవ్వాల్సి రావడంతో తమ లాంటి అనేక మందికి ఈ సారి మంత్రి పదవి దక్కలేదన్నారు. తమ కోసం పని చేసి హత్యకు గురైన ఏవీ లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
వారిని న్యాయం జరగడం కోసం పోరాడతామన్నారు. నంద్యాలలో భూమా కుటుంబం భవిష్యత్ లో తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రజల కోసమే తమ కుటుంబం ఉంటుందన్నారు.