వైసీపీకి అసలు రాజకీయ సంస్కారం ఉందా?

Tuesday, December 17, 2024

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో వారు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. వారికి అసలు అంబేద్కర్ తయారుచేసిన రాజ్యాంగం అంటే విలువ లేదని, వారు రాష్ట్రంలో అమలు చేస్తున్నది రాజారెడ్డి రాజ్యాంగం అని అనేకమార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి విమర్శల్ని కూడా వారు ఖాతరు చేయలేదు. తాము ఏం చేయదలచుకుంటే అది చేసుకుంటూ పోయారు. వారికి చట్టం పట్ల, నియమ నిబంధనల పట్ల ఎలాంటి గౌరవం కూడా లేకుండాపోయింది.

అధికారంలో వారే ఉన్న రోజుల్లో కూడా.. నిబంధనలను పాటించి అనుమతులు తీసుకోవడం వంటివి.. వారి చేతిలో పనే అయినప్పటికీ.. అలాంటి రాజకీయ సంస్కారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పాటించనేలేదు. ఆ ప్రభావమే. ఇప్పుడు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు గండంగా మారుతోంది. అహంకారం, పొగరుతో కూడిన వారి వ్యవహార సరళి వల్ల.. ఇప్పుడు కూల్చివేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ తన పార్టీకి కార్యాలయాలను నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకున్నారు. పదులకోట్ల రూపాయలు విలువ చేసే వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూములను కారుచౌకగా లీజుకు తీసుకోవడం జరిగింది. ఆ మేకు కేబినెట్ ఆమోదించింది. అయితే చాలా జిల్లాల్లో భూములను లీజుకు తీసుకునే ప్రక్రియ పూర్తి కాలేదు కూడా. తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి వారు ఆయా ప్రదేశాల్లో మునిసిపల్ అధికార్లకు దరఖాస్తు చేశారు. అయితే అనుమతులు వచ్చేదాకా ఆగాలని, లేదా, ప్రభుత్వం తమదే గనుక.. తక్షణం అనుమతులు వచ్చేలా చూసుకోవాలని వారు అనుకోలేదు.

ఎటూ దరఖాస్తు పడేశాం.. అనుమతి ఉంటే ఎంత? లేకపోతే ఎంత? తమను అడిగేవారు ఎవ్వరు? అన్నట్టుగా చెలరేగిపోయారు. అనుమతులు రాకుండానే పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటూ పోయారు. ఎన్నికలకు ముందే వాటిని పూర్తిచేయాలనుకున్నారు గానీ.. చాలా చోట్ల పూర్తి కాలేదు.
కాగా రాష్ట్రంలో అధికారం మారిపోయింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న నిర్మాణాలపై దృష్టి పెట్టింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏవీ అనుమతులతో జరుగుతున్న నిర్మాణాలు కాదని గుర్తించింది. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో సీతానగరంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పూర్తిగా అధికారులు నేలమట్టం చేశారు. అలాగే విశాఖలోను, రాజమండ్రిలోను అనుమతులు తీసుకోకుండా సాగుతున్న నిర్మాణాలకు నోటీసులు సర్వ్ చేశారు.

నేడో రేపో వాటిని కూల్చేసే అవకాశం ఉంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారం పొగరు కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలనే రాజకీయ సంస్కారం వారికి లేకపోవడం వల్ల, చట్టాన్ని నిబంధనల్ని గౌరవించే అలవాటే లేకపోవడం వల్ల ఇవాళ కూల్చివేతల పరిస్థితి వచ్చిందని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles