సాంకేతికంగా తమకు ఎమ్మెల్యే హోదా, డాబూ దర్పం అన్నీ కావాలి. కానీ ఎమ్మెల్యేగా ఏ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి ప్రజలు తమకు ఓట్లు వేశారో.. ఆ పని మాత్రం తాము చేయకూడదు.. అన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేల తీరు తయారవుతున్నదా? శుక్రవారం నాడు ప్రారంభమైన 16వ అసెంబ్లీలో వైసీపీ అధినేత, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును గమనించిన ఎవ్వరికైనా అదే అనుమానం కలుగుతుంది. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందనే సామెత చందంగా.. జగన్మోహన్ రెడ్డి రాబోయే అయిదేళ్లలో అసెంబ్లీలో ఎంత గౌరవప్రదంగా వ్యవహరించబోతున్నారో.. ఈరోజే తెలిసిపోయింది. యథారాజా తథా ప్రజా అన్నట్టుగా ఆయన అనుచర ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటనే అనుసరిస్తే గనుక.. రాబోయే రోజుల్లో అసెంబ్లీ అధికార పార్టీ మినహా ఖాళీగా ఉండబోతున్నది.
4వ తేదీ ఫలితాలు వెలువడిన నాటినుంచి ఇప్పటిదాకా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ, లేదా, పార్టీ నాయకులతో భేటీ వేసిన ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెబుతున్నారు. ఈ మాత్రం సంఖ్యాబలంతో.. మనం అసెంబ్లీలో ఉండి చేసేదేం లేదు అని అంటున్నారు. అయితే ఆ మాత్రం ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల గొంతుకను సభలో వినిపించాలనే బాధ్యతను ఆయన మరచిపోతున్నారు. ఓడిపోయినంత మాత్రాన వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ గా ఉంటామని ప్రకటించిన జగన్ ఆ పని చేయడంలేదు.
శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం అనంతరం జగన్ సభలో అసలు కూర్చోకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయి.. తన ఓర్వలేని బుద్ధిని చాటుకున్నారు. ఇవాళంటే ప్రమాణ స్వీకారం గనుక వచ్చారు. రేపటినుంచి అసలు జగన్ సభకు వస్తారా? లేదా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
జగన్ సంగతి సరే.. ఓర్వలేకపోతున్నారని అనుకోవచ్చు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పది మంది కూడా సభకు రారేమో అని కొందరు భావిస్తున్నారు. మరి ఆ మాత్రం గెలిపించినందుకు సభకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే ప్రజలు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తారో లేదో చూడాలి.