ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల తొమ్మిదవ తేదీన ఆదివారం శుక్లపక్ష తదియనాడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లోనే చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇవాళ మంగళవారం సాయంత్రం కూటమి పార్టీల ప్రతినిధులు గవర్నర్ ను కలిసి లేఖ ఇవ్వబోతున్నారు.
అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపట్లో ఆయన రాజభవన్ కు వెళ్లి గవర్నరుకు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అయితే జగన్ స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లకుండా.. తన ప్రతినిధి ద్వారా రాజీనామా లేఖ పంపుతారని ప్రచారం జరిగింది. అలాకాకుండా ఆయనే స్వయంగా వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు ధర్మ ముఖ్యమంత్రిగా ఉండవలసిందిగా గవర్నర్ కోరనున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఎప్పుడూ ఉంటుందనే విషయంలో రకరకాల తర్జన భర్జనలు జరిగాయి. మంచి ముహూర్తం చూసుకొని ఆదివారం 9వ తేదీన చేయడానికి నిర్ణయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ అధినాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం ఎప్పుడూ ఉండబోతుంది అనేదాన్ని బట్టి.. చంద్రబాబు ప్రమాణానికి మోడీ కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదు. మీడియా ప్రతినిధులు ఫోన్ చేసినా కూడా వారు స్పందించడం లేదు. ఫలితాలు అన్నీ ఖరారైన తర్వాత మంగళవారం సాయంత్రానికి పార్టీ తరఫున సజ్జన రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేస్తారని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి 151 కంటె ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పిన తర్వాత.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ప్రమాణ స్వీకారం 9వ తేదీన కొత్త రాజధాని విశాఖపట్నంలో ఉంటుందని ప్రకటించారు. అయితే వారు నిర్ణయించిన ముహూర్తం మాత్రం పదిలంగా అలాగే ఉంది. కాకపోతే.. వేదిక మారింది. విశాఖ బదులు అమరావతిలో జరగనుంది. సీఎం కూడా మారారు. జగన్ బదులుగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు.
జగన్ రాజీనామా: 9 న బాబు ప్రమాణం!
Thursday, November 21, 2024