భక్తి+అసమర్ధత కలిసి వేటు పడింది!!

Friday, November 22, 2024

వారందరూ జగన్మోహన్ రెడ్డికి ప్రీతిపాత్రులు. ఆయన భక్తులు. ఆయన సేవలోనే తరించిపోవాలని అనుకుంటూ ఉండే అధికారులు. ఎన్నికలకు ముందు కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిష్పాక్షికంగా అధికారంలో ఉన్న పార్టీ వారి అడుగులకు మడుగులొత్తకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యవహరించాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా, వారు మాత్రం జగన్ భక్తిని ప్రదర్శించుకోవడంలోనే తరించిపోతూ వచ్చారు.
జగన్ భక్తి ప్రదర్శనలో హద్దు దాటిన వారిని పోలింగుకు ముందు చివరి రోజు వరకు కూడా ఎన్నికల విధులను తప్పిస్తూ ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలో తగు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ తమ మీద వేటు పడకుండా వ్యవహరించిన కొందరు అధికారులు.. పోలింగ్ ముగిసిన తర్వాత అధికార పార్టీలోని ఫ్రస్టేషన్ను తమ ఒళ్ళంతా పులుముకొని అధికార పార్టీ తరఫు కార్యకర్తలు లాగా వ్యవహరించడం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో శాంతిభద్రతలను దారుణంగా దెబ్బ తీసింది. ఇలాంటి అధికారులు అందరిమీద ఎన్నికల సంఘం ఒక్కసారిగా వేటువేసింది.
పోలింగ్ గురించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రేగిపోతున్న హింసాత్మక సంఘటనల గురించి కన్నెర్ర చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు జిల్లాల పరిధిలో ఇంకా అనేకమంది అధికారులపై వేటువేసింది. పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం, పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది. వీరితోపాటు 12 మంది సబార్డినేట్ పోలీసు అధికారులను కూడా ఈసీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈసీ ఆగ్రహానికి గురైన అందరూ అధికారుల మీద శాఖపరమైన విచారణ జరగాల్సిందిగా, వారి వారి విధుల నిర్వహణలో ఇంత దారుణమైన వైఫల్యాలు ఎందుకు ఎదురయ్యాయో సంజాయిషీ తీసుకోవలసిందిగా ఈసీ ఆదేశించింది.
పోలింగ్ సోమవారం పూర్తి కాగా, మంగళవారం నుంచి తిరుపతి, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల సహా అనేక ప్రాంతాలలో విచ్చలవిడిగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ వద్దనే తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని మీద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు హత్యాయత్నానికి తెగబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాచర్లలో ఇరువర్గాల ఘర్షణలు దాడులు పోలీసుల వైఫల్యానికి అద్దం పట్టాయి. తాడిపత్రిలో సైతం ఇదే ధోరణి.
ఈ వైఫల్యాలను సహించలేక రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిలను గురువారం నాడు ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన ఎన్నికల సంఘం.. వారితో చర్చల అనంతరం ఈ అధికారులందరినీ విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి అధికార పార్టీకి కొమ్ముకాసినందుకు, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జగన్ భక్తిని ప్రదర్శించుకోవడంలో మితిమీరినందుకు.. శాంతిభద్రతలు అదుపుతప్పడానికి స్వయంగా తామే కారణం అయినందుకు వీరందరూ ఇవాళ చర్యలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ దుర్బుద్ధులకు తగిన శాస్తి జరిగిందని, వీరిపై చర్యల ద్వారా సమాజంలో శాంతి సుహ్రుద్భావ వాతావరణాలు ఏర్పడుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles