ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బు పంపిణీ అనే వ్యవహారం పార్టీల నాయకులకు చాలా తలనొప్పిగా మారుతోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా డబ్బు పంపిణీ మీదనే ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈసారి వారికి డబ్బు పంచాలన్నా కూడా భయం వేస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చాలా ఉన్నదని, డబ్బు తీసుకుని కూడా ఓట్లు వేస్తారో లేదో అనుమానంగా ఉందని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే.. డబ్బు తీసుకున్న వారితో ప్రమాణం చేయించుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు కనీసంగా రెండు వేల నుంచి అయిదువేల వరకు ధర నిర్ణయించి పంపిణీ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. అయితే ఈ పార్టీ వారికి వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా ప్రజలనుంచి స్పందన ఉంటోంది. డబ్బులైతే ఇస్తున్నారు గానీ.. వారు ఓట్లు వేస్తారా? లేదా? అనే సందేహాలు వెన్నాడుతున్నాయి. దాదాపుగా అన్ని పార్టీల పెద్ద నాయకులు కూడా తమ ప్రచారంలో.. తమ ప్రత్యర్థుల మీద చెబుతూ వారు డబ్బులిచ్చి ఓట్లు కొనడానికి సిద్ధమవుతున్నారు.. వారి వద్ద డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓట్లు మాత్రం మా పార్టీ గుర్తుకు వేయండి- అని ప్రచారం చేశారు. కడపలో వైఎస్ షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు డబ్బులిస్తే తీసుకుని హస్తం గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు. జగన్ కూడా పలుసభల్లో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చాలా సంపాదించారని, ఆ పార్టీ వారు డబ్బలిచ్చి ఓట్లను కొంటారని, వారు ఓట్లకు ఎంత డబ్బు ఇచ్చినా సరే.. తీసుకుని ఓటు మాత్రం తమ ఫ్యాను గుర్తుకు వేయాలని కోరారు. అదేమాదిరి చంద్రబాబు కూడా చెప్పారు.
ఇలాంటి ప్రచారాలే ఇప్పుడు డబ్బు పంచుతున్న నాయకులను , ప్రధానంగా వైసీపీ వారిని భయపెడుతున్నాయి. ప్రజలుఇలాంటి మాటలను ఫాలో అయి.. తాము ఇచ్చే డబ్బు తీసుకుని ఓట్లు ఎదుటి పార్టీ వారికి వేస్తే ఎలా అని ఆలోచిస్తున్నారు. అందుకే బిడ్డలపై ప్రమాణం చేయమని అడుగుతున్నారు.
తమ ఓట్లకోసం ఆరాటపడుతూ.. తమకు అలాంటి కండిషన్లు పెట్టడం చాలా చోట్ల ప్రజలకు నచ్చడం లేదు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోనే కొండవరం అనే గ్రామంలో ప్రమాణం చేస్తేనే డబ్బులు ఇస్తామని వైసీపీ నాయకులు చెప్పడంతో.. ప్రజలు ఎదురుతిరిగి.. డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే పొండి.. ప్రమాణాలు మాత్రం చేసేది లేదు అని గొడవపడడం జరిగింది. ఇవ్వకపోతే ఓటు నెగటివ్ గా మారుతుందని భయం, ఇస్తే హాయిగా పుచ్చుకుని ఓటు వేయరేమో అనే అనుమానం.. రెండింటి మధ్య వైసీపీ నాయకులు సతమతం అవుతున్నారు.
డబ్బు పుచ్చుకోగానే బిడ్డలపై ప్రమాణం!
Tuesday, November 5, 2024