కన్నకూతురు కుటుంబాన్ని రచ్చకీడ్చిన అంబటి!

Friday, November 22, 2024

కుటుంబాలలో వివాదాలు ఉండడం సహజం. అయితే ఇంటిగుట్టు బజార్న పడకుండా సర్దుబాటు చేసుకుంటూ ముందుకుపోతుంటారు. లేదా, సర్దుబాటు చేసుకునే స్థాయిలో లేనప్పుడు తెగతెంపులు చేసుకుంటారు.. ఇది చాలా సహజం. అయితే కన్న తండ్రే.. కూతురు కుటుంబంలో ఉన్న రచ్చలను బజారుకీడ్చటం, తన రాజకీయ ప్రయోజనాల కోసం కూతురు పరువును బజార్లో చర్చకు పెట్టడం చాలా అసహ్యకరమైన పరిణామం!  ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు.. అలాంటి తప్పు చేసినట్టుగా కనిపిస్తోంది. కూతురు కుటుంబ వివాదాల్ని ఆయన బయటపెట్టడం ద్వారా.. సెల్ఫ్ గోల్ వేసుకున్నారని ఆయన సొంత పార్టీలోనే అనుకుంటున్నారు.

అంబటి రాంబాబు రెండో అల్లుడు గౌతమ్ హైదరాబాదులో ఒక ప్రెవేటు ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తున్నారు. ఆయన అంబటి రాంబాబుకు ఓటు వేయవద్దంటూ ఒక వీడియో విడుదల చేశారు. అందులో అంబటి రాంబాబును తీవ్రంగానే నిందించారు. ‘మా మామ  ఒకనీచుడు.. అతనికి వ్యక్తిత్వం లేదు. శవాలమీద పేలాలు ఏరుకునేరకం. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్టు లెక్క. ఎవరైతే నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకుని అరిచి అబద్ధాన్ని నిజం చేయొచ్చనే భ్రమలో బతుకుతారో అలాంటి వాళ్లకు ఓటేస్తున్నట్టు లెక్క. ఎంత నీచమైన పనులు చేసినా సమాజంలో హుందాగా బతకవచ్చని అనుకునే వాళ్లను ప్రోత్సహించినట్టు అవుతుంది.. అంబటి వంటి వారిని ఎన్నుకుంటే.. రేపటి సమాజం కూడా అలాగే తయారవుతుంది’ అంటూ డాక్టర్ గౌతమ్ వీడియో విడుదల చేశారు. సహజంగానే ఈ వీడియో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. పవన్ కల్యాణ్ కూడా ఈ మాటలను ప్రస్తావించారు. అసలే సత్తెనపల్లిలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న అంబటి రాంబాబుకు ఇది ఇబ్బందికరంగా తయారైంది. దీంతో ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రయత్నంలో తన కూతురు వ్యక్తిగత జీవితపు విషయాలను కూడా ఆయన బజార్లో పెట్టడం పట్ల పలువురిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తన అల్లుడి మాటల వెనుక కుట్ర ఉన్నదని, పవన్ కల్యాణ్, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ కలసికట్టుగా నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. అంతవరకు ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ.. తన రెండో కూతురు డాక్టర్ మనోజ్ఞ భర్తతో విడిపోయిందని, నాలుగేళ్లుగా తన వద్దనే ఉన్నదని అంబటి రాంబాబు చెప్పుకున్నారు. గౌతమ్ తన కుమార్తెను బెదిరించి విడాకులు ఇవ్వాలని కోరారని, కుమార్తెతో పాటు ఆమె పిల్లల భవిష్యత్తుకోసం తాను ఫైట్ చేస్తున్నానని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. అంటే కూతురు భర్తతో విడిపోతే.. బహుశా భరణం, తదితర సెటిల్మెంట్ల కోసం అంబటి రాంబాబు పోరాడుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. భర్త మీద పోరాడకపోతే.. కన్నకూతురుకు, ఆమె పిల్లలకు అంబటి రాంబాబు భవిష్యత్తును చూపించలేడా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కూతురు కుటుంబంలో తగాదాలు ఉంటే సర్దుబాటు చేయాలి.. లేదా, తెగతెంపులు చేసుకుని ఆమెకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి గానీ.. అటూ ఇటూ కాకుండా చేయడంతో పాటూ.. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె వ్యక్తిగత జీవితగొడవలను బజారుకీడ్చడం తప్పు కదా అని రాంబాబు నే నిందిస్తున్నారు. మరి ఇలాంటి నిందలకు ఆయన ఏం సమాధానం చెప్పగలుగుతారో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles