భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులకు కోపం వస్తే ఏ రీతిగా ఉంటుందో.. వారి జోలికి వెళితే ఎలాంటి ఆగ్రహావేశాలను కురిపిస్తారో.. ధర్మవరం సభలో నిరూపించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా, వైయస్సార్ కాంగ్రెస్ పట్ల భారతీయ జనతా పార్టీ మెతక వైఖరిని అవలంబిస్తోంది అనే తరహాలో.. రాష్ట్రంలో సాగుతున్న కుట్రపూరిత వ్యూహాత్మక ప్రచారాలకు అమిత్ షా తెరదించారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టం లేదని, అందుకే మేనిఫెస్టో మీద తన ఫోటో వేసుకోవడానికి కూడా అనుమతించలేదని.. రకరకాల అబద్ధపు ప్రచారాలతో ఏపీ ప్రజలను పక్కదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుయత్నాలను కూడా అమిత్ షా తిప్పికొట్టారు. ఆయన మాటల ఉధృతిని గమనిస్తే.. జగన్ పతనానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్నట్లుగానే అనిపిస్తోంది.
జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో.. భారతీయ జనతా పార్టీ ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వం. తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతాం. ఆంధ్రాలో భూమాఫియాను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికి మేము కూటమిగా జతకట్టాం.. అంటూ తీవ్రమైన పదజాలంతో అమిత్ షా విరుచుకుపడడం ప్రత్యేకంగా గమనించాలి.
తెలుగు భాషను జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అంతం చేయడానికి పూనుకున్నారని సంకేతాలు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం చదువు, ఐబి సిలబస్ అనే రకరకాల మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. తెలుగు భాషకు జగన్ సమాధి కట్టేస్తున్నారని ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆ నేపథ్యంలో అమిత్ షా భారతీయ జనతా పార్టీ బతికి ఉన్నంతవరకు తెలుగు భాషను చావనివ్వం అనే మాట అనడం ప్రత్యేకంగా పరిగణించాలి. అదే మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద దివ్య క్షేత్రం తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలుసు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి జగన్ ప్రభుత్వ హయాంలో మద్దతు లభించింది అని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడుతామని అమిత్ షా ప్రతిజ్ఞ చేయడం విశేషం. అమరావతి రాజధాని కూడా అదే తరహాలో బిజెపి కట్టుబడి ఉంటుందని ఆయన మరో మారు పునరుద్దాటించారు.
కేవలం ఇది మాత్రమే కాదు. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాలు వ్యవధిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అమిత్ షా వాగ్దానం చేయడం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వాసుల చిరకాల వాంఛ రాబోయే రెండేళ్లలో నెరవేరుతుందని అందరూ ఆశిస్తున్నారు.