జాతీయ చానెల్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జగన్మోహన్ రెడ్డి అహంకారం అడుగడుగునా కనిపిస్తోంది. కేవలం ఆయన అహంకారం మాత్రమే కాదు.. ఆయన దుర్మార్గమైన వైఖరి, పెత్తందారీ పోకడలు, ఎమ్మెల్యేలు అంటే ఆయనకు ఎంత చులకన భావం ఉన్నదో అన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి జగన్ జాతీయ చానెల్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను విని ఆ అభ్యర్థులే సిగ్గుపడుతున్నారు. జగన్ తమ పరువు తీశారని అనుకుంటున్నారు.
ఇంతకూ జగన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా..?
‘ప్రభుత్వంపైన ముఖ్యమంత్రిగా నాపైన ప్రజల్లో వ్యతిరేకత లేదు. కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటుంది. ప్రజలు నన్ను చూసే ఓటేస్తారు. ఇది ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎన్నిక కాదని, భవిష్యత్తును మలుపుతిప్పే ఎన్నిక అని పదేపదే చెబుతున్నాను’’ అని జగన్ అంటున్నారు.
రాష్ట్రంలో ఓట్లు మొత్తం జగన్ మొహం చూసి పడేట్లయితే.. ఎవరో ఒకరిని అభ్యర్థులుగా నిలబెడతేసరిపోయేది కదా. ఆ అభ్యర్థుల మీద వంద రకాల కసరత్తులు, బోలెడు విడతలుగా జాబితాలను రిలీజ్ చేయడాలు ఎందుకు జరిగినట్లు? ఎమ్మెల్యేల్లో దాదాపు యాభై శాతానికి పైగా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి అటుఇటూ ఎందుకు మార్చినట్టు? కేవలం ఎమ్మెల్యేల మీద మాత్రమే ప్రజా వ్యతిరేకత ఎలా ఏర్పడుతుంది?
సైన్యంబు చెడుగైన దడనాధుని తప్పు అని కదా రాజనీతి. ఎమ్మెల్యేలు చేతగానివాళ్లు, అసమర్థులు అయితే వారందరికీ నాయకుడు అయినటువంటి జగన్ మాత్రం సమర్థుడు అయిపోతాడా? అయినా ఒక చోట వ్యతిరేకత కూడగట్టుకున్న వ్యక్తులను మరో నియోజకవర్గానికి మార్చడం అంటే.. ఆ కొత్త నియోజకవర్గం ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడుతున్నట్టే కదా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
జగన్ మాటలను ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చాలా అవమానంగా భావిస్తున్నారు. అన్ని ఓట్లు జగన్ మొహంచూసి పడేట్లయితే.. మేం కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి మేమంతా వందల వేల కోట్ల రూపాయలు తగేలాయాలా? అని వారు నైరాశ్యానికి గురవుతున్నారు. జగన్ తన ఎమ్మెల్యే అభ్యర్థులను అసమర్థులుగా ప్రొజెక్టు చేస్తున్నట్టుగా, చేతగానివాళ్లని చెబుతున్నట్టుగా ఆ ఇంటర్వ్యూ ఉన్నదనే విమర్శలు ప్రజల్లో బాగా వినిపిస్తున్నాయి.