వివేకాహత్యలో జగన్ పాత్ర మరోసారి తెరపైకి!

Saturday, November 23, 2024

వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అని, ఆయనే దగ్గరుండి ఈ హత్యను చేయించారని ఎవ్వరూ అనడం లేదు. ఆయన హంతకులను కాపాడుతున్నారని మాత్రమే అంటున్నారు. ఈ హత్య చేసిన వారిని మళ్లీ పార్లమెంటు గడప తొక్కనివ్వవద్దని, తమకు న్యాయం కావాలని వైఎస్ షర్మిల, సునీత ఇద్దరూ ప్రజల ఎదుట న్యాయం కోరుతూ ఎన్నికల సమరంలో పోరాడుతున్న సంగతి అందరికీ తెలుసు. అయితే వారు తమ ప్రచార ప్రసంగాల్లో వివేకా హత్య విషయం ప్రస్తావించడానికి వీల్లేదంటూ కడప కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
అదలా ఉండగా.. తెలంగాణ హైకోర్టులో, ఈ హత్యకేసులోని మరో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర మరోసారి ప్రస్తావనకు వచ్చింది. హత్య వెనుక ఉన్న అసలు నిందితులు, ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితులు, బంధువులు కావడంతో.. వారికి బెయిలు ఇస్తే సాక్షులను తారుమారు చేయడం, ప్రభావితం చేయడానికి అవకాశం ఉన్నదని సునీత తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించడం గమనార్హం.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితులు సీఎం జగన్ కు సన్నిహితులని కోర్టులో చెప్పడం సంగతి అటుంచితే.. ఆ ప్రధాన నిందితుల్ని జగన్ చాలా గట్టిగా వెనకేసుకురావడం రాష్ట్రప్రజలు రెండురోజుల కిందటే ప్రత్యక్షంగా గమనించారు.

అవినాష్ రెడ్డి పసివాడు.. ఆయన రాజకీయ భవిష్యత్తును అంతం చేయడానికి అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు.. అంటూ జగన్మోహన్ రెడ్డి నిందితుడు అవినాష్ మీద ఏ స్థాయిలో ప్రేమానురాగాలు కురిపించారో అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదు.. ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నాను కాబట్టే.. నేను మళ్లీ టికెట్ ఇచ్చాను.. గెలిపించండి.. అంటూ కేవలం ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే కాదు.. దర్యాప్తును కూడా దారి మళ్లించే విధంగా జగన్ చేసిన ప్రకటనలను కూడా అందరూ గమనించారు.

అలాంటి నేపథ్యంలో ఒక నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ నాలుగుసార్లు తిరస్కరణకు గురైనప్పటికీ అయిదోసారి మళ్లీ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే సీబీఐ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో పిటిషన్ సంగతి తేల్చకుండా 29వ తేదీకి వాయిదా వేశారు.

కడప కోర్టు ఆదేశాల వలన సునీత, షర్మిల నేరుగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే ఉంటున్నప్పటికీ.. వివేకా హత్య కేసులో జగన్ పాత్ర ఏదో ఒక విధంగా చర్చకు వస్తూనే ఉండడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles