బోండా పేరు వచ్చేదాకా దర్యాప్తు చేస్తూంటారా?

Saturday, December 21, 2024

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఆకతాయి రాయి విసిరిన కేసులో పోలీసులు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు గాని, వాస్తవంలో ఇంకా చాలా చిక్కుముడులు విడిపోవాల్సి ఉంది. పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించినప్పటికీ వారి దర్యాప్తు తీరు గురించి, నిందితులపై మోపిన అభియోగాల గురించి అనేక రకాల సందేహాలు ప్రజలలో వ్యాప్తి చెందుతున్నాయి. విజయవాడలోని వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ అనే యువకుడు రాయి విసిరినట్టుగా నిర్ధారించిన పోలీసులు..

అతడిని దుర్గారావు అనే వ్యక్తి ప్రేరేపించినట్లుగా చెబుతున్నారు గాని ఆధారాలు చూపించడం లేదు. దుర్గారావును కూడా పోలీసులు నిర్బంధించి విచారిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న బోండా ఉమామహేశ్వర రావు పేరు బయటకు చెప్పే వరకు పోలీసులు దుర్గారావు తో విచారణ పూర్తి చేసేలా కనిపించడం లేదని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అందుకోసం అదుపులోకి తీసుకున్న వ్యక్తులను దారుణంగా హింసిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
అసలు ఏ ఆధారాలతో వేముల సతీష్ రాయి విసిరాడని నేరస్తుడిగా అరెస్టు చేశారో.. ఆ సంగతిని పోలీసులు ఇప్పటిదాకా ముడి విప్పడం లేదు. ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు గాని, కేవలం వీఆర్వో ద్వారా రికార్డు చేసిన స్టేట్మెంట్ల ప్రకారమే అయితే వారి దర్యాప్తు న్యాయస్థానంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలో ఉండే కాలనీవాసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వద్దకు వెళ్లకుండా దూరంగా ఉన్న విఆర్వో వద్దకు వెళ్లి ఎందుకు స్టేట్మెంట్లు ఇచ్చారు అనేది ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. వైసిపి నాయకులు తమకు కావలసిన రీతిలో స్టేట్మెంట్లను ఫ్యాబ్రికేట్ చేయడం కోసమే వీఆర్వో ద్వారా రికార్డు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి.
వేముల దుర్గారావు పేరును ఇప్పటివరకు నిందితులలో కూడా చూపించకుండా నిర్బంధించి ప్రశ్నిస్తుండడం వెనుక కీలకమైన మర్మం దాగి ఉందని అంచనాలు రాజకీయ వర్గాలలో వినవస్తున్నాయి.

బోండా ఉమామహేశ్వరరావును అరెస్టు చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నించారనే చర్చ నడుస్తోంది. ఆయన ఇంటికి, కార్యాలయం వద్దకు వందల సంఖ్యలో పోలీసులు వెళ్లడం నానా హంగామా చేయడం ఇలాంటి పుకార్లు పుట్టడానికి కారణం అవుతోంది. అదే సమయంలో తెరవెనుక తాను ఉన్నట్లుగా వారు ఒప్పుకునే వరకు అరెస్టు చేసిన వారిని పోలీసులు దారుణంగా హింసిస్తున్నారంటూ బోండా ఉమా ఆరోపిస్తున్నారు. వడ్డెర కాలనీలో ఉండడమే వేముల దుర్గారావు చేసిన పాపమా అని బోండా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో విచారణ సాగుతున్న తీరు రిమాండ్ రిపోర్టులో నిందితుడిగా పేరు చూపించకుండానే దుర్గారావు ద్వారా తాము కోరుకుంటున్న వారి పేర్లను చెప్పించాలని చేస్తున్న అడ్డదారి ప్రయత్నం ఇవన్నీ  వివాదాస్పదం అవుతున్నాయి. పోలీసులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రీతికరంగా ఉండేలాగా నిందితుల జాబితాను తయారు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రజల అనుమానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles