మార్జాల మూషిక న్యాయం అంటే కాస్త బరువుగా కనిపించవచ్చు గానీ.. సింపుల్ గా చెప్పాలంటే ‘పిల్లి- ఎలుక న్యాయం’ అన్నమాట. అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. ఒక గదిలో ఒక పిల్లి- ఒక ఎలుక మాత్రమే ఉన్నాయని అనుకోండి. ఆ ఎలుకకు చిన్న గాయం అయినా నేరం పిల్లి మీదకే కదా వెళుతుంది. ఎలుకకు ఏ రకంగానైనా గాయమై ఉండవచ్చు గాక.. కానీ నింద మాత్రం పిల్లి మోయాల్సిందే. ఇది చాలా సహజమైన సూత్రం.
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే అచ్చంగా అదే అనిపిస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికోసం తలపడుతున్నది ఇద్దరే వ్యక్తులు. ఒకరు ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, రెండోవారు ఆ పదవిని ఆశిస్తున్న నారా చంద్రబాబునాయుడు. కారణం ఏమైనా కావచ్చుగాక.. అది నిదానంగా తేలుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి చిన్న గాయం కాగానే, అందరి కళ్లూ చూపులూ చంద్రబాబు వైపు మళ్లడం సహజం.
పైన చెప్పుకున్న ‘మార్జాల మూషిక న్యాయం’ ఉదాహరణలో కీలకం ఏంటంటే- ఎలుకకు గాయం అయితే అందరూ తననే అనుమానిస్తారనే సంగతి పిల్లికి కూడా బాగా తెలుసు. అందుకనే.. గదిలో ఉన్నంత సేపు ఆ ఎలుక జోలికి వెళ్లకుండా ఉంటుంది. ఆ ఎలుకకు అసలేమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. తన మీద నిందపడకుండా చూసుకుంటుంది. అదే సమయంలో- ఎలుకకు పిల్లిని ఇబ్బంది పెట్టాలని అనిపిస్తే.. తనంత తానుగా వెళ్లి ఏ గోడకో ఢీకొని చిన్న గాయం చేసుకుంది అనుకుందాం. అప్పుడు కూడా అనుమానాలు మాత్రం పిల్లి మీదకే వెళతాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. అంటే ఇక్కడ జగన్ తనకు తానే గాయం చేయించుకున్నారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే.. ఏ ఆకతాయి ఏ కారణంతో ఆయన మీద రాయి విసిరినా సరే.. నిందలు చంద్రబాబు మీద పడుతున్నాయి. ఇలా జరుగుతుందనేది తెలిసి కూడా తెలుగుదేశం వారు ఎందుకు దాడిచేయిస్తారు అనేది ఆలోచించాలి.
ఇది అల్లరి మూకల పని అయిఉండవచ్చుననే సందేహాలు వినిపిస్తున్నప్పుడు వాటిని తోసిపుచ్చడానికి వైసీపీ దళాలు చాలా తాపత్రయపడుతున్నాయి. అల్లరిమూకలకు ఆ అవసరం ఏముంది..అని బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మేధావులు అంటున్నారు. ఆయన మీద రాయి వేయించాల్సిన అవసరం తెలుగుదేశానికి మాత్రం ఏముంది? రాయి దెబ్బ తగిలితే జగన్ కే సానుభూతి అని వారికి తెలుసుకదా.. అనేది ప్రజల వాదనగా ఉంది. పోలీసులు ఇది అల్లరి మూకల దాడి అని తేల్చినా కూడా వైసీపీ వారు ఒప్పుకునేలా లేరు. కానీ.. నింద తమకు తప్పదని తెలుసు గనుక.. తెలుగుదేశం ఈ పనిచేయించే అవకాశం లేదు. చేసినదెవరో, కారకులెవరో పోలీసులు తేల్చేదాకా అందరూ సంయమనం పాటిస్తే మంచిది.
‘మార్జాల- మూషిక న్యాయం’- జగన్ వ్యవహారం!
Friday, November 15, 2024