విజయవాడ నడిబొడ్డున విద్యుత్తు కోత కారణంగా అలముకున్న చీకట్లలో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్రపైకి ఎవరో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి జగన్, ఆయనతోపాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డారు. జగన్ తలకు, ఎడమకంటికి ఎగువభాగంలో నుదుటిపై జరిగిన గాయానికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు రెండు కుట్లు వేశారు. గాయం చిన్నదే అయినా వాపు ఎక్కువగా ఉండడంతో విశ్రాంతి అవసరం అని సూచించారు. బస్సుయాత్రకు ఆదివారం విరామం ప్రకటించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ నియోజకవర్గంలో బస్సపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతుండగా ఇది జరిగింది. ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అత్యంత సమీపంలోనే ఘటన జరిగింది. బస్సులోనే ప్రథమ చికిత్స చేయించుకున్న జగన్ యాత్రను కొనసాగించి.. బస చేసే కేసరపల్లి వరకు వెళ్లారు. తర్వాత అక్కడకు సీఎం భార్య భారతి కూడా చేరుకున్నారు. ఇద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి కుట్లు వేయించుకోవడం జరిగింది.
అయితే అత్యంత పటిష్టమైన బందోబస్తు భద్రత ఏర్పాట్ల మధ్య ఉండే సీఎం జగన్ మీద ఇలాంటి దాడి జరగడం చిత్రంగా కనిపిస్తోంది. దాడికి ఎవరు పాల్పడినప్పటికీ.. ఇది పూర్తిగా పోలీసు శాఖ భద్రత వైఫల్యంగా పలువురు పరిగణిస్తున్నారు. అన్నింటికీ మించి.. అసలు ముఖ్యమంత్రి అంతటి నాయకుడు ఆ ప్రాంతంలో పర్యటనకు వస్తోంటే.. ఆ సమయంలో విద్యుత్తుకోత ఎలా విధించారు. కరెంటు పోవడం ఎలా జరిగింది? అనేది ముందు తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జగన్ కు తగిలిన గాయం గురించి ముఖ్యనేతలు అందరూ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తన ట్వీట్ లో జగన్ త్వరగా కోలుకోవాలని కోరారు. దాడిని ఖండిస్తున్నానని, నిష్పక్షపాత విచారణ జరిపించి నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ, స్టాలిన్, కేటీఆర్ వంటి నాయకులందరూ కూడా.. రాజకీయ దాడులను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. మరోవైపు తెలుగుదేశానికి చెందిన మరికొందరు నాయకులు.. ఈ రాయిదాడి సంఘటన కూడా కోడికత్తి డ్రామా వంటిదేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్షుణ్నంగా విచారిస్తున్నారు.
బస్సుయాత్రలో ఘటన : జగన్ తలకు గాయం
Friday, December 20, 2024