షర్మిలపై మాటల దాడికి తెలంగాణ నుంచి నేతల దిగుమతి!

Saturday, October 5, 2024

వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథిగా, కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా చేటు చేస్తున్నదో.. ఆమె చాలా విపులంగా సభలలో వివరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచారాస్త్రంగా షర్మిల వాడుకుంటున్నారు. ఆమె విమర్శల జడివానలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిక్కు తోచడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల మీద సూటిగా విమర్శల దాడి చేయడానికి తెలంగాణ నుంచి కడపకు నాయకులు దిగుమతి అవుతూ ఉండడం గమనార్హం. వైయస్ షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించినప్పుడు, వైయస్సార్ కీలక అనుచరుల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి ఆమె వెంట నిలిచారు. ఆమెకు కీలకమైన మద్దతుదారుడుగా పర్యటనలన్నింటిలోనూ పాల్గొంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆమె నిర్ణయించుకున్న తర్వాత కొండా రాఘవరెడ్డి పూర్తిగా దూరం జరిగి షర్మిలపై విమర్శనాస్త్రాలు కురిపించారు.

అటువంటి కొండా రాఘవరెడ్డిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప బరిలోకి దిగుమతి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు షర్మిలను తిట్టినా సరే ఆ విమర్శలు అంత ప్రభావశీలంగా కనిపించడం లేదని, ఆమె అదే స్థాయిలో తిరుగు దాడి చేస్తున్నారని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. కొండా రాఘవరెడ్డిని ప్రత్యేకంగా అందుకోసమే తీసుకు వచ్చినట్లుగా ఉంది. ఆయన కడపలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి షర్మిల మీద ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమెను రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎవ్వరూ గుర్తించే అవకాశం లేదని ఆయన అంటున్నాడు. మహా నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు.

అయితే తెలంగాణ నుంచి వచ్చిన నాయకులు చేస్తున్న ఈ విమర్శల మీద కడప స్థానిక ప్రజలకు విశ్వసనీయత ఉంటుందా? వారు వచ్చి తిట్టినంతమాత్రాన స్థానిక ప్రజలంతా షర్మిలను అసహ్యించుకుంటారా? సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. షర్మిల అడిగే మాటలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్సీపీ నాయకులకు గతి లేదు కనుకనే.. వారు చెబుతున్న అబద్ధపు మాటలకు ప్రజలలో విశ్వసనీయత లేదు కనుకనే.. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా నాయకులను దిగుమతి చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి వైసీపీ నాయకులు వీటికి ఎలాంటి కౌంటర్లతో సిద్ధమవుతారో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles